గతం.. వర్తమానం.. భవిష్యత్తు.. కొత్త ఆర్వోఆర్ చట్టం రూపకల్పనలో కీలక అంశాలు

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టం తయారీలో అతి జాగ్రత్తలు పాటిస్తున్నది.

Update: 2024-08-03 02:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టం తయారీలో అతి జాగ్రత్తలు పాటిస్తున్నది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే చట్టాన్ని అమలు చేయాలన్న కృతనిశ్చయాన్ని ప్రకటించింది. విస్తృతంగా చర్చించి రూపకల్పన చేసే సదుద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నది. 15 ఏండ్ల తర్వాత దేశంలో సత్సంప్రదాయానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో 2011 లో రుణ అర్హత కార్డుల చట్టం అమలుకు ముందు అప్పటి రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలో జిల్లా, డివిజన్, రీజినల్ స్థాయిలో విస్తృతంగా చర్చకు పెట్టారు.

అలాగే కేంద్రంలో 2006లో అటవీ హక్కుల చట్టాన్ని అమలు ముందు కూడా దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అందుకే 2007 లో పార్లమెంటులో ఆమోదించారు. ఎవరి కోసం చట్టాలను రూపొందిస్తున్నామో, వారికి అర్థం కావాలి. అలాగే వారి నుంచే అభిప్రాయాలను తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు అసెంబ్లీలోనే ప్రకటించడం వెనుక భవిష్యత్తు ఉన్నది. తెలంగాణలో ఐదో ఆర్వోఆర్ చట్టాన్ని గత చరిత్ర, ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. 18 రాష్ట్రాల ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు ది బెస్ట్ యాక్టులను తెలంగాణకు అవరమైన పాయింట్లను తీసుకున్నారు.

బిహార్ ఆర్వోఆర్ చట్టం, అక్కడ ప్రత్యేక మ్యుటేషన్ల కోసం రూపొందించిన చట్టాలను స్టడీ చేశారు. బ్రిటిష్ వాళ్ల నుంచి సంక్రమించిన ఆర్వోఆర్ చట్టాల తయారీని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. చట్టం డ్రాఫ్ట్ ని రూపొందించడంలో ధరణి కమిటీ సభ్యుడు, రెవెన్యూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ కీలక పాత్ర వహించారు. ఆయన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, పలు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన రెవెన్యూ చట్టాలను రూపొందించి అందించిన ఘనత వహించారు. అయితే తెలంగాణ ఆర్వోఆర్-2024 బిల్లు తయారీలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎమ్మార్వో లచ్చిరెడ్డిలు కూడా సునీల్ తో 15 సార్లు సమావేశమయ్యారు. గంటల కొద్దీ చర్చించిన తర్వాత డ్రాఫ్ట్ ని ప్రభుత్వానికి సమర్పించారు. 20 సెక్షన్లు, 23 పేజీలతో ఆర్వోఆర్-2024 ముసాయిదాను విడుదల చేశారు.

కేంద్ర చట్టాలకు అనుగుణంగా..

కేంద్ర ప్రభుత్వం భూ చట్టాల్లో రెండు కీలక పరిణామాలకు తెర తీసింది. వ్యవసాయ భూములకు భూధార్ నంబర్ ని ఇవ్వాలని, గ్రామాల్లో ప్రతి ప్రాపర్టీకి స్వమిత్వ కార్డులను జారీ చేయాలని భావిస్తున్నది. ఈ రెండింటినీ తెలంగాణలోనూ అమలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ఆర్వోఆర్ చట్టం-2020లో ఆ సదుపాయం లేదు. అందుకే ఇప్పుడు ఈ రెండు ప్రక్రియలను చేపట్టేందుకు వీలుండేలా కొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా భవిష్యత్తులో భూ సమగ్ర సర్వేకు వెళ్లాలని భావిస్తే కేంద్రమే నిధులను సమకూర్చే అవకాశం ఉంటుంది. స్వమిత్వ కార్డుల ద్వారా ప్రాపర్టీ వ్యాల్యుయేషన్ పై కచ్చితత్వం వస్తుంది. భూదార్, స్వమిత్వ కార్డుల ద్వారా రుణ సదుపాయానికి ప్రతి ప్రాపర్టీ హోల్డర్ కి మేలు కలుగుతుంది. ఈ ప్రక్రియను చేపట్టేందుకు చట్టబద్ధతను కల్పించారు.

భూదార్ కార్డులకు శ్రీకారం

కొత్త పాసు పుస్తకాలతో పాటు ఈ దఫా భూదార్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్డులను టెంపరరీ, పెర్మినెంట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇచ్చేందుకు టెంపరరీ భూదార్ కార్డులను, రానున్న రోజుల్లో సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత పెర్మినెంట్ భూదార్ కార్డులను ఇవ్వాలని భావిస్తున్నారు. దీని ద్వారా హక్కులు పక్కా కానున్నాయి. ఒక రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు అడుగులు వేస్తున్నట్లే.

మ్యుటేషన్ ఆపే అధికారం

రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఆటోమెటిక్ గానే ఉంటుంది. అయితే మ్యుటేషన్ కి ఇబ్బందులు, సమస్యలు తలెత్తినప్పుడు ఆపే అధికారాన్ని ఆర్డీవో స్థాయి అధికారికి కట్టబెట్టారు. రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ బాధ్యత తహశీల్దార్లదే. కానీ వారసత్వం, భాగ పంపకాలు, కోర్టుల ద్వారా డీడ్, ఆక్షన్ ద్వారా పొందినవి, ఓఆర్సీ, లావునీ, సేల్ సర్టిఫికెట్ల ద్వారా వచ్చే మ్యుటేషన్ల బాధ్యతను ఆర్డీవోలకు కట్టబెట్టారు. అంటే ఆస్తి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పాత్రలో తహశీల్దార్లతో పాటు ఆర్డీవోలకు పవర్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఆబాది, అగ్రికల్చర్ ల్యాండ్స్ కి సెపరేట్ వ్యవస్థలను పెట్టారు. నాన్ అగ్రికల్చర్, ల్యాండ్ మ్యుటేషన్లకు అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. నాలా కన్వర్షన్ లోనూ ఫిర్యాదులు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. అప్పీల్స్ ని రివిజన్ చేసే అధికారం కూడా ఏర్పాటు కానున్నది.

సాదాబైనామాలకు లాస్ట్ చాన్స్

రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వపు నిర్లక్ష్యానికి పెండింగులో పడిన సాదాబైనామాల దరఖాస్తులను క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. పెండింగులోని 9 లక్షల అప్లికేషన్లకు ఈ డ్రాఫ్ట్ లో సదుపాయం కల్పించారు. ఇంత వరకు ఉచితంగానే చేయనున్నారు. 2014 జూన్ 2 కటాఫ్ డేట్ గా నిర్ణయించారు. ఇప్పటికే అప్లయ్ చేసిన వాటికే ఇది వర్తిస్తుంది. అయితే రానున్న రోజుల్లోనూ సాదాబైనామాలకు అవకాశం ఉంటుంది. కానీ దానికి లెక్క ప్రకారం పూర్తి స్థాయిలో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిందే. దీని ద్వారా స్టాంప్ డ్యూటీని తప్పించుకునేందుకు చేపట్టే సాదాబైనామాలకు చెక్ పడనున్నది.

అప్పీల్ వ్యవస్థ

ఇప్పుడున్న చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా కోర్టుకు వెళ్లాలంటూ అధికారులే లిఖితపూర్వకంగా రాసిస్తున్నారు. సామాన్యులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న ఈ సమస్యకు చెక్ పెట్టారు. గత ప్రభుత్వాల మాదిరిగానే అప్పీల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. తహశీల్దార్, ఆర్డీవోలు రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ లో ఉన్నారు. అందుకే ఫస్ట్ అప్పీల్ అదనపు కలెక్టర్/కలెక్టర్, సెకండ్ అప్పీల్ ని సీసీఎల్ఏకు చేసుకునేటట్లుగా రూపొందించారు. మండల, డివిజన్ స్థాయిలో న్యాయం జరగకపోతే జిల్లా స్థాయిలోనే దాదాపు సమస్యను పరిష్కరించేలా చట్టం చేస్తున్నారు. సీసీఎల్ఏ నిర్ణయాలను కూడా ప్రభుత్వానికి రివిజన్ చేసే అధికారం ఉంటుంది. కోర్టుకు వెళ్లి న్యాయం పొందాలన్న కఠినతర నిబంధనల నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తున్నారు.

అప్డేషన్‌కి చాన్స్

ఆర్వోఆర్ చట్టంలోనే తప్పొప్పుల సవరణకు అప్డేషన్ కి చాన్స్ ఇస్తున్నారు. ప్రతి కరెక్షన్ కి తిరిగి అప్లికేషన్, కోర్టు.. ఇలాంటివేవి ఉండకుండా రికార్డులను చూసి సరి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విలేజ్ అకౌంట్ అప్ డేట్ ని నిర్వహిస్తారు. దీని ద్వారా విస్తీర్ణంపై పేచీ లేకుండా ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు, సర్వే చేసినప్పుడు కొత్త రెవెన్యూ రికార్డును తయారు చేసుకోవచ్చు. తిరిగి వాటిని అప్ లోడ్ చేసే సదుపాయం ఉంటుంది.

చట్టంలో మరికొన్ని అంశాలు

– రెండున్నర ఎకరాల కంటే తక్కువగా తరి, ఐదెకరాల కంటే తక్కువగా మెట్ట భూములు ఉన్న వారిని సన్నకారు రైతులుగా నామకరణం చేశారు. ఒక ఎకరం తరి పొలం అంటే రెండు ఎకరాల డ్రై ల్యాండ్ గా భావిస్తున్నారు.

– రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సేల్, గిఫ్ట్ డీడ్, మార్ట్ గేజ్, పార్టిషన్ వంటివి వెబ్ సైట్ లో పేర్కొన్న ఆప్షన్ల ద్వారానే జరుగుతాయి.

– రిజిస్ట్రార్ కేటాయించిన డేట్, టైం ప్రకారం నిర్దిష్ట ఫార్మాట్ లోనే ఇవి నిర్వహిస్తారు.

– స్టాంప్ డ్యూటీ కూడా యథావిధిగా కొనసాగుతుంది.

– ప్రతి అంశానికి గైడ్ లైన్స్ ప్రత్యేకంగా రూపొందిస్తారు.

Tags:    

Similar News