కాకతీయుల కట్టడాల పెయింటింగ్స్.. 12 నుంచి 14 వరకు మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో డిస్ప్లే
తెలంగాణ వారసత్వ సంపద, సాంస్కతిక వైభవం, కళలను పరిరక్షించి భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో టార్చ్, కళాయజ్ఞ బృందం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వారసత్వ సంపద, సాంస్కతిక వైభవం, కళలను పరిరక్షించి భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో టార్చ్, కళాయజ్ఞ బృందం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. చరిత్రను తెలియ జెప్పే మాధ్యమాలుగా ఎన్నో పుస్తకాలు, ఆడియో, వీడియో, గ్రంథాలు.. ఇలా చాలా మాధ్యమాల రూపంలో ఉంటాయి. కానీ చాలా వరకు కాకతీయుల కట్టడాలు కొన్ని శిథిలావస్థకు చేరి , ఇతరత్రా కారణాల ద్వారా శిథిలమైతే వాటి పాత రూపం ఎలా ఉంటుందో చూడాలన్న భావన టూరిస్టులకు ఉంటుంది. అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే ప్రాజెక్టు పునర్జీవ.. శిథిలమైన పురాతన కట్డడాలు, ఆలయాలు ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టేలా అద్బుతమైన పెయింటింగ్స్ రూపంలో చెప్తే ఎలా ఉంటుందన్న భావన వారిలో కొత్త ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనకు తెరలేపింది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా మంథనిలోని చెంద్రవెళ్లి దేవాలయాలు, ఘనపురం కోటగుళ్లు, రామప్ప దేవాలయాలను ప్రాజెక్టులో భాగం చేసింది.
12 నుంచి 14 వరకు ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్స్..
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా 60 మంది కళాత్మక నైపుణ్యం కలిగిన సభ్యులు కాకతీయుల అద్భుత కట్టడాలకు తమ పెయింటింగ్ నైపుణ్యంతో వాటికి కొత్తరూపు ఇచ్చారు. ఒక శిల్పంలో ఒక భాగం ధ్వంసం అయితే దానికి వీళ్లే పూర్వ రూపాన్ని చేర్చి పెయింటింగ్స్ గీస్తున్నారు. ఈ నెల 11 వరకు 120 పెయింటింగ్స్ పూర్తి చేయనున్నారు. ఈ పెయింటింగ్‌లు అన్నింటిని ఈ నెల 12 నుంచి 14 వరకు మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో పెట్టనున్నారు. అంతేకాకుండా వీటిని ఒక బుక్ రూపంలో తీసుకువెళ్లే ఆలోచన చేస్తున్నారు. తమ ప్రయత్నాన్ని గుర్తించడంతో పాటు ఆయా కట్టడాల పునరుద్దరణకు ప్రభుత్వం చర్యలు చేపడితే టూరిజం డెవలప్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అరవింద్ ఆర్య.. టార్చ్(టీమ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్) సభ్యుడు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో పోలిస్తే కాకతీయులకు సంబంధించి తెలియని చరిత్రే ఎక్కువ ఉంది. ఈ మేరకు అన్వేషణ కొనసాగిస్తున్న టార్చ్ బృందం, తమ పరిశోధనలో వెలుగులోకొచ్చిన సమాచారాన్ని డాక్యుమెంట్ రూపంలో భద్రపరిచి ముందుతరాలకు అందిస్తుంది. ప్రాజెక్ట్ పునర్జీవ పేరుతో శిథిల ఆలయాలు, ఆకారం చెదిరి రూపు కోల్పోయిన శిల్పాల గత రూపును గతంలో వందల ఏళ్ల క్రితం ఎలా ఉండేవో ఐకనోగ్రఫీ ప్రకారం పరిశోధించి పెన్సిల్ ఆర్ట్, డిజిటల్ ఆర్ట్ రూపంలో డాక్యుమెంట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా రిటైర్డ్ ఆర్కియాలజిస్ట్ ఈమని శివ నాగి రెడ్డి, ప్రముఖ కళాకారుడు ఏలూరి శేషబ్రహ్మం, తదితర బృందంగా ఏర్పడి దాదాపు 100 పాడైపోయిన శిల్పాల ఫోటోలను సేకరించి, స్కెచింగ్ చేసి, శిల్పాలకు పాత రూపాన్ని క్రియేట్ చేస్తున్నారు.