PAC Chairman Arikepudi Gandhi: అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్.. టెన్షన్
అరికెపూడి గాంధీ ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధమవుతోందని సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
PAC Chairman Arikepudi Gandhi: పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధమవుతోందని సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన ఇంటి చుట్టూ ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి 100 మంది పోలీసులతో ఆ ప్రాంతం మొత్తం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారం గత ఐదు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత అరికెపూడి గాంధీకి సవాల్ విసరడంతో గురువారం ఉదయం గాంధీ.. తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాడు.
ఈ క్రమంలోనే కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు గాంధీని, 30 మంది ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా సీపీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. వెంటనే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం గాంధీపై కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు.