పీసీసీపై సొంత కేడర్ గుస్సా..! పార్టీలో కొనసాగుతోన్న వర్గపోరు

టీపీసీసీ పనితీరుపై సొంత పార్టీకి చెందిన సీనియర్ లీడర్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2025-04-13 01:47 GMT
పీసీసీపై సొంత కేడర్ గుస్సా..! పార్టీలో కొనసాగుతోన్న వర్గపోరు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ పనితీరుపై సొంత పార్టీకి చెందిన సీనియర్ లీడర్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆశించిన స్థాయిలో పని తీరు లేదని, కేడర్‌కు సైతం దిశానిర్దేశం చేయడంలో ఫెయిల్ అవుతున్నదని పెదవి విరుస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదని, ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విపక్షాల విమర్శలకు సైతం దీటైన కౌంటర్లు ఇవ్వడంలోనూ విఫలం అవుతున్నట్టు సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వర్గ‌పోరు కంటిన్యూ

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ప్రభుత్వ కార్యక్రమాలపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పార్టీ యాక్టివిటీస్‌కు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇంటర్నల్‌గా పార్టీ బలోపేతం కోసం పీసీసీనే ఎక్కువ చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో పార్టీలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపైనే ఎక్కువగా ఉంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి పలువురు హస్తం గూటికి చేరారు. దీంతో కొత్త, పాత లీడర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో విబేధాలు అప్పుడప్పుడు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఫోకస్ పెడుతున్నా.. పీసీసీ నుంచి ఆశించిన స్థాయిలో చొరవ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా చాలా జిల్లాల్లో వర్గపోరు కొనసాగుతున్నదని టాక్.

పథకాలపై ప్రచారంలోనూ వెనుకబాటు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే పలు స్కీమ్స్‌ను ప్రారంభించింది. వాటి అమలుపై ఆశించినంత స్థాయిలో ప్రచారం జరగడం లేదు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ లీడర్లు ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెడతారని ఆశించినా.. అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని టాక్. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం పథకంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి స్వయంగా ఎమ్మెల్యేలు, పీసీసీకి లేఖలు రాశారు. కానీ ప్రచారం మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదని, జిల్లా లీడర్లకు పార్టీ నుంచి డైరెక్షన్స్ వెళ్లలేదని టాక్.

సోషల్ మీడియా‌లోనూ మౌనం

విపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్‌గా ఉండేది. నాటి ప్రభుత్వ తప్పులను ఎండగట్టేందుకు చాలా చొరవ తీసుకునేది. ఆ ఉత్సాహం ప్రస్తుతం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వెనకబడి ఉన్నామని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఆ లోటును పూడ్చడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తుంటే, వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ఫైర్ అవుతున్నారు. చాలా మంది లీడర్లు సోషల్ మీడియాలో సొంత ఇమేజీని పెంచుకునేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. వారితో వ్యక్తిగతంగా తమకు అనుకూలమైన పోస్టింగ్ పెట్టించుకుంటున్నారే కాని పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచేందుకు ప్రయత్నించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లోపం ఎక్కడుంది?

ఓ వైపు విపక్షాలు.. ప్రభుత్వంపై ఆరోపణలు, విష ప్రచారం చేస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ దీటుగా కౌంటర్లు ఇవ్వడం లేదని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఫోన్ చేసి విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని సూచిస్తే తప్పా లీడర్లు మీడియా ముందుకు రావట్లేదని ఆరోపణలున్నాయి. పార్టీ వేదికలపై మాట్లాడే లీడర్లు సైతం బీజేపీ, బీఆర్ఎస్‌ ఆరోపణలకు గట్టి సమాధానం ఇవ్వడం లేదని టాక్. అడిగిన వెంటనే పార్టీకి ప్రభుత్వం నుంచి సమాచారం రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి సమకూర్చుతున్నామని, కానీ విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో లీడర్లు విఫలం అవుతున్నారని మరోవైపు ఓ మంత్రి సన్నిహితులు వాదిస్తున్నారు. ఈ మధ్య అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయలేదు. కనీసం ఆయా వర్గాలతోనూ జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించేందుకు పార్టీ జిల్లా నేతలు ముందుకు రాలేదని విమర్శలున్నాయి.

ఇకనైనా పని చేయకుంటే...

ఇటీవల జరిగిన కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది. సొంత పార్టీ నేతలు సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని టాక్. ఆ తర్వాతైనా ఓటమిపై పార్టీ నాయకత్వం రివ్యూ నిర్వహించలేదు. ఎందుకు ఓడిపోయాం? ఎవరెవరు సహకరించలేదు? అనే అంశాలపై ఆయా జిల్లా లీడర్లతోనూ సమీక్షలు నిర్వహించలేదు. జూన్ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైనా పార్టీ లీడర్లు మేల్కొని క్షేత్ర స్థాయిలోని సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ చాలా వీక్‌గా ఉండగా.. ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాలని, లేకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని కేడర్ ఆవేదన చెందుతున్నది.

నటరాజన్‌ను తప్పుదారి పట్టించారా?

కంచ గచ్చిబౌలిలోని ప్రభుత్వ భూముల విషయంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటీవల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌కు వచ్చారు. నేరుగా సెక్రెటేరియట్‌కు వెళ్లి మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. వర్సిటీకి వెళ్లి విద్యార్థులతోనూ మాట్లాడారు. సివిల్ సొసైటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. భూముల విషయంలో స్టేట్ లీడర్లు తప్పుదారి పట్టించడంతోనే ఆమె సెక్రెటేరియట్‌కు, ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారే తప్పా, మీనాక్షికి మరో ఉద్దేశం లేదని ఆమెకు సన్నిహితంగా ఉండే లీడర్లు వెల్లడించారు. సమస్యను పరిష్కరించాలనే తాపత్రయంతో ఆమె సచివాలయానికి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు.. రాజకీయంగా వచ్చే విమర్శలను ముందుగానే అంచనా వేసి, ఆమెను పీసీసీ అలర్ట్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

గాంధీ భవన్‌లో పైరవీకారులు?

గాంధీభవన్‌లో కొందరు లీడర్లు పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరు మంత్రి తమకు క్లోజ్ అని, సెక్రెటేరియట్‌లోని 6వ అంతస్తుతో తమకు మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పి కొందరితో పనుల విషయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. గడవులోపు పని పూర్తికాకపోవడంతో బాధితులు గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు టాక్. జిల్లా స్థాయి పదవుల కోసం కొందరు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో పీసీసీ చొరవ తీసుకుని పైరవీకారులను కట్టడి చేయకపోతే, అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News