మంత్రివర్గంలోకి అవకాశం దక్కేదెవరికి.. ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తొలి కేబినెట్ భేటీలో పాల్గొన్నప్పటికీ ఎవరికి ఏ శాఖ కేటాయించారనేది అధికారికంగా వెల్లడికాలేదు. ఒక్కో మంత్రికి ఒక్కో రకమైన పోర్టుఫోలియో ఇచ్చినట్లు సూచనప్రాయంగా వచ్చిన వార్తలను మంత్రులు ఖండించారు. ముఖ్యమంత్రి నుంచి ఇప్పటివరకూ తమకు శాఖల కేటాయింపుపై ఎలాంటి సమాచారం లేదని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు తెలిపారు.
ఫస్ట్ క్యాబినెట్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించడానికి వచ్చినప్పుడు ఆర్థికశాఖ మంత్రిగా వెల్లడిస్తున్నారా అని పాత్రికేయులు ప్రశ్నించగా తన పోర్టుఫోలియోను ప్రభుత్వం ఇంకా డిసైడ్ చేయలేదని, మీడియాలోనే వార్తలు వస్తున్నాయన్నారు. మీ అంతట మీరే (జర్నలిస్టులను ఉధ్దేశిస్తూ) శాఖలను కేటాయించినట్లుగా చెప్పుకుంటున్నారని, ఇంకా ఖరారు కాలేదన్నారు. శాఖలను కేటాయించకపోయినా ఆయా డిపార్టుమెంట్ల అధికారులే పరిపాలనాపరంగా ఉత్తర్వులు ఇస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.
మరో ఆరుగురు మంత్రులెవరు?
రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇప్పటికే పన్నెండు మంది (సీఎం రేవంత్‌రెడ్డితో కలిపి) ప్రమాణ స్వీకారం చేయగా ఇంకా ఆరుగురు రావాల్సి ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుత కేబినెట్‌లో స్థానం లేకపోవడంతో విస్తరణలో వారికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. ఈ జిల్లాల్లో ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ ఆలీ, మదన్‌మోహన్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ నుంచి ఇద్దరు, ఎస్సీ నుంచి ఒకరు, మైనారిటీ నుంచి ఒకరు, రెడ్డి నుంచి ఇద్దరు చొప్పున ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం.
బీసీల్లో గొల్లకుర్మ, ముదిరాజ్ సామాజికవర్గాలకు స్థానం దక్కొచ్చని, ఎస్సీల్లో మాదిగ కులానికి ప్రాధాన్యత ఉండొచ్చని సమాచారం. క్యాబినెట్ విస్తరణకు ఇంకా స్పష్టంగా తేదీలను ఖరారు చేసుకోలేదని, ప్రస్తుతం ఏర్పడిన క్యాబినెట్‌కు కొన్ని ప్రాధాన్యతా అంశాలు ఉన్నందున ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మిగిలిన మంత్రులను చేర్చుకోవడంపై దృష్టి సారించనున్నట్లు ఒక మంత్రి వ్యాఖ్యానించారు. అధిష్టానంతోనూ కొత్తగా చేర్చుకునే మంత్రుల గురించి చర్చించాల్సి ఉన్నదని, కొంత సమయం పట్టే అవకాశమున్నదని పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పలువురు ఆశావహులు ఉన్నందున ఇప్పటికిప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకునేకంటే కులాలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం అభిప్రాయాలతో ఫైనల్ చేసే ఆలోచనలో పార్టీ ఉన్నది.