ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఆగేనా? నాన్ క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాబోధన

నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

Update: 2024-08-27 02:48 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అడ్మిషన్ల సమయంలో ఎలాగూ అడ్మిషన్ ఫీజులు, కాశన్ ఫీజులు అంటూ ఏవేవో ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నడ్డి విరిచేయడమే కాకుండా యూనిఫామ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్ ల పేరుతో ఇష్టారీతిన నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల దోపిడీ పరాకాష్టకు చేరింది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చేతులు ముడుచుకు కూర్చుంది. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్ధులు చదువుకునే పరిస్థితి దాటి చదువుకొనే దుస్థితి దాపురించిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్ కే జీ, యూకేజీ చదువులకే లక్షల ఫీజులు..

నిజామాబాద్ జిల్లాలో ఎల్ కే జీ, యూకేజీ చదువులకే లక్షల రూపాయల వరకు ఫీజుల రూపేనా పిండుకుంటున్నారు. అడ్మిషన్ల టైం లోనే అడ్మిషన్ ఫీజుతో పాటు పూర్తి ఫీజులో సగానికి పైగా చెల్లించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. మధ్య మధ్యలో విద్యార్థులకు టాలెంట్ టెస్టులు, సైన్స్ టెస్టులు ఏవేవో పేర్లతో వేలకు వేలు చెల్లించాలని పేరెంట్స్ కు నోటీసులు పంపిస్తున్నారని కొందరు పేరెంట్స్ ఫిర్యాదు చేస్తున్నారు. పాఠశాలలో రోజువారీ తరగతులను నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన చేయాల్సి ఉండగా వాటి పైన దృష్టి సారించకుండా, యాజమాన్యానికి అదనపు ఆదాయాన్ని విద్యార్థుల నుంచి ఎలా సమకూర్చుకోవాలో పకడ్బందీగా ప్లాన్లు వేసి మరీ ఫీజుల కోసం వేధిస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోర్డుపై ప్రదర్శించని ఫీజుల వివరాలు..

ప్రతి ప్రైవేట్ స్కూల్ లో విధిగా ఏయే తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారనేది డిస్ ప్లే చేయాలని ప్రభుత్వం నిబంధనల ఉంది. కానీ, జిల్లాలోని ఏ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు తెలిపే బోర్డుల డిస్ ప్లే ను ఏ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నిబంధనలను తుంగలో తొక్కుతున్న యాజమాన్యాలను అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

బోధనా సిబ్బందికి అరకొర వేతనాలు..

విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలు బోధనా సిబ్బందికి మాత్రం అరకొరగా వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. రెండు వేల మందికి పైగా విద్యార్థులు, ఏడు నుంచి 10 స్కూల్ బస్సులున్న స్కూల్ లో టీచర్ గా పనిచేసే టీచర్ కు కూడా రూ. 8 వేలు నుంచి రూ. 10 వేలు మాత్రమే చెల్లిస్తుండడం శోచనీయం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో శనివారం స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సి ఉన్నా ఈ నిబంధనను స్కూళ్లు పట్టించుకోవడం లేదు. ఒకవేళ కొన్ని స్కూళ్లు రెండో శనివారాల్లో విద్యార్థులకు సెలవులు ప్రకటించినా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లకు కూడా సెలవు ఇవ్వకుండా యాజమాన్యాలు అదనపు పని ఒత్తిడితో వేధిస్తున్నాయని టీచర్లు వాపోతున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో లీవ్ కావాలని కోరినా అనుమతించడం లేదని, డ్యూటీకి ఐదు, పది నిమిషాలు ఆలస్యంగా వెళితే ఆరోజు డ్యూటీ చేసినా సాలరీ కట్ చేస్తున్నారని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధుల నుంచి సకాలంలో ఫీజులు వసూలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత స్కూళ్లో విధులు నిర్వర్తించే టీచర్లపైనే భారం మోపుతున్నారని టీచర్లు చెపుతున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించని విద్యార్థులను ఇబ్బందులు పెట్టాలని, విద్యార్థుల ఫీజులు వసూలయ్యేదాకా క్లాస్ రూంలో ఇతర విద్యార్థుల ఎదుట దురుసుగా మాట్లాడి క్లాస్ బయట నిలబెట్టి పనిష్మెంట్ ఇవ్వాలని చెపుతున్నట్లు కొందరు టీచర్లు తెలిపారు.

ర్యాంకుల కోసం వేధింపులు..

మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా హింసిస్తున్నారని విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. నిజామాబాద్ లోని శ్రీచైతన్య విద్యా సంస్థలో చదివే హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న భోజనంలో కుళ్లిపోయిన కూరగాయలతో వండిన భోజనాన్ని వడ్డిస్తూ విద్యార్థుల అనారోగ్యానికి కారణమవుతున్నారనే ఆరోపణలున్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు కొద్దిరోజుల క్రితం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు కూడా చేశారు. పాఠశాలలోని హాస్టల్ వంటగదిలో కుళ్లిపోయిన కూరగాయలను రెడ్ హ్యాండెడ్ గా అధికారికి చూపించారు. జిల్లాలోని కొన్ని పాఠశాలలు తప్పుడు డాక్యుమెంట్స్ తో అనుమతులు తీసుకొని నడుపుతున్నాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

అనుమతులు లేకున్నా అన్ని అనుమతులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ దర్జాగా నడిపిస్తున్న స్కూల్స్ కూడా ఉన్నట్లు పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నగరంలోని చాలా స్కూళ్లకి నిబంధనల ప్రకారం ప్లే గ్రౌండ్ కూడా లేని స్కూల్స్ తో పాటు, ఏదైనా అనుకోని సందర్భాల్లో పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగితే విద్యార్థులు సేఫ్ గా తప్పించుకునే అవకాశాలు లేకుండా ఏర్పాటైన స్కూల్స్ ఉన్నా అధికారులు అనుమతులు ఎలా ఇస్తారని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.


Similar News