కొత్త కొత్వాల్ నియమాకం ఎప్పుడు..

నిజామాబాద్ పోలీసు కమిషనర్ నియామకం ఎప్పుడు అనే చర్చ జరుగుతుంది.

Update: 2023-05-13 16:44 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీసు కమిషనర్ నియామకం ఎప్పుడు అనే చర్చ జరుగుతుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గానీ కొత్తగా కమిషనరేట్ ఏర్పడిన తర్వాత గానీ కొత్వాల్ పోస్టు ఎన్నడు ఖాళీగా లేదు. మొన్నటి వరకు అనగా కె.ఆర్.నాగరాజు కమిషనర్ గా పదవీ విరమణ చేసి అప్పుడే 45 రోజులు గడిచిపోయాయి. బాసర జోన్ లో ఉన్న నిజామాబాద్ జిల్లాకు అనూహ్యంగా నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ను ఇంచార్జి పోలీసు కమిషనర్ గా నియమించారు. ఆయన రెండు జిల్లాలో పోలీసు బాసుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నిజామాబాద్ లాంటి జిల్లాకు పోలీసు కమిషనర్ నియామకంకు అడుగులు ముందుకు పడకపోవడానికి సవాలక్ష కారణాలు చెబుతున్నారు. కె.ఆర్.నాగరాజు పదవి విరమణకు ముందే చాలా మంది నిజామాబాద్ కు రావడానికి ఆసక్తి చూపారు.

కానీ సంబంధిత ఫైల్ ప్రభుత్వం వద్ పెండింగ్ లో ఉండడంతో నియామకం పై ఊగిసలాట ధోరణి కొనసాగుతుంది. గతంలో నిజామాబాద్ లో పనిచేసేందుకు పలువురు అధికారులు జిల్లాకు చెందిన మంత్రితో పాటు సీఎం పేషి వరకు వెళ్లిన నియామకం పై సందిగ్ధం కొనసాగుతుంది. మొన్నటికి మొన్న ముగ్గురు డీఐజీలకు ఐజీలుగా పదోన్నతులు కలిగించినప్పుడే నిజామాబాద్ పోలీసు కమిషనర్ నియామకం ఖరారు కావాల్సి ఉండగా సెక్రటేరియేట్ ఓపెనింగ్ ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో అది వాయిదా పడింది. రోజులు ఇట్టే గడిచిపోతుండగా నెలన్నర కాలంలో ప్రెండ్లీ పోలీసు సంగతి దేవుడెరుగు కానీ పాలన గాడితప్పతుందని వాదనలు వినిపిస్తున్నాయి.

ఉత్తర తెలంగాణలో అతిపెద్ద జిల్లాగా నిజామాబాద్ జిల్లా పేరుగాంచింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఐదు నియోజకవర్గాలు కలిగి హైదరాబాద్ తర్వాత అతి పెద్ద జిల్లాగా నిజామాబాద్ పేరు కలిగి ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలు వామపక్ష తీవ్రవాద ప్రాభాల్య ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో నిజామాబాద్ ఒక్కటి. ప్రస్తుతానికి 33 పోలీస్ స్టేషన్లు ఉండగా కొత్తగా మూడు ఠాణాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతానికి నిజామాబాద్ లో మూడు పోలీసు సబ్ డివిజన్ లు ఉండగా కొత్తగా నిజామాబాద్ సిటి సబ్ డివిజన్ గా చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఠాణాల విస్తీర్ణ ఎక్కువగా ఉండడంతో ఎస్సై స్థాయి నుంచి ఎస్ హెచ్ ఓ గా బదాలాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో అదనపు పోలీసు కమిషనర్ (అడ్మిన్), అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్), టాస్క్ ఫోర్స్ ఏసీపీ లాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో జిల్లాలో అదనపు పోలీసు కమిషనర్లు ఉన్నప్పుడు, కమిషనర్ సెలవులో వెళ్లినప్పుడే వారికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి అదనపు సీపీగా(ఏఆర్) గిరిరాజ్ కు అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. కమిషనర్ మూడు రోజులు నిర్మల్ కు, మరో మూడు రోజులు నిజామాబాద్ కు సమయాన్ని కేటాయించే పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలతో పాటు సున్నీతమైన ప్రాంతాల్లో పోలీసింగ్ నిర్వాహణ ఒక్కరికే కత్తిమీద సాములా మారింది. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా గతంలోనూ సీఎంవో ఓఎస్డీతో పాటు ఇద్దరు మహిళ అధికారులు, మరో అధికారి జోరుగా ప్రయత్నాలు చేశారు.

మహిళా అధికారుల నియామకం దాదాపు ఖాయమైపోయిందని చర్చ కూడా జరిగింది. కానీ ప్రస్తుతం అతి పెద్ద జిల్లాగా ఉన్న నిజామాబాద్ కు సమర్ధులైన అధికారులను నియమించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఆలస్యమౌతుందని వాదనలు లేకపోలేదు. ఇటీవల కాలంలో ర్యాంకర్ అధికారి కమిషనర్ గా వస్తున్నారని చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతుంది. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా నియామకం కొరకు ఏకంగా సీఎంవోనే ఓకే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సీజన్ ప్రారంభానికి కొన్ని నెలలే ఉండడంతో ఐపీఎస్ ను నియమిస్తారా? లేక ర్యాంకర్ ను నియమిస్తారా అని చర్చ కూడా జరుగుతుంది. గతంలో పనిచేసిన అధికారులు బీఆర్ఎస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేశారన్న అపవాదు ఉండనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బలపడుతూ బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్న తరుణంలో వచ్చే కొత్త అధికారి ఏ విధంగా సమన్వయం చేస్తారో అలాంటి అధికారికే సీపీ పోస్టు ఇస్తారనే చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News