నిజామాబాద్ లో కుండపోత వర్షం…రోడ్లన్నీ జలమయం

నిజామాబాద్ జిల్లాలో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. జిల్లా కేంద్రం నిజామాబాద్ తో పాటు దాదాపు అన్ని మండలాల్లోనూ వర్షం భారీగా కురిసింది.

Update: 2024-08-19 11:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. జిల్లా కేంద్రం నిజామాబాద్ తో పాటు దాదాపు అన్ని మండలాల్లోనూ వర్షం భారీగా కురిసింది. నిజామాబాద్ నగరంలో రెండు గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి నగరంలో ఎక్కడ కూడా రోడ్లు కనిపించలేదు. రోడ్లపై నీటి ప్రవాహం కాలువలుగా పారింది. డ్రైనేజీలు నుండి నీరంతా బయటకు వచ్చి రోడ్డు మీద పారడం గమనార్హం. నగరంలోని కంటేశ్వర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వైపు వెళ్లే రహదారిలో రైల్వే కమాన్ అండర్ రైల్వే బ్రిడ్జి (యూ ఆర్ బీ) కింద వర్షపు నీరు భారీగా చేరడంతో ఆర్టీసీ బస్సు నీటి మధ్యలో చిక్కుకుంది.

వర్షపు నీరు బస్సులోకి చేరడంతో ప్రయాణీకులు భయంతో అరుపులు, కేకలు వేశారు. భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణీకులకు స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు బాసటగా నిలిచారు. వారికి ధైర్యం చెప్పి బస్సు నుంచి కిందకు దింపి బయటకు తీసుకొచ్చారు. కొందరు ఈదుకుంటూ బయటికొచ్చారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రైల్వే కమాన్ వద్ద కనిపించలేదు. గతంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, చిన్నపాటి వాహనాలు ఇబ్బందుల మధ్య రోడ్డు దాటినప్పటికీ, ఆర్టీసీ బస్సు నీటి మధ్యలో చిక్కుకోవడం ఇదే మొదటిసారని స్థానికులంటున్నారు. మున్సిపల్ సిబ్బంది నీటిని తోడేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం

నగరంలోని ఆర్సపల్లి, మాలపల్లి, ఖిల్లా, బోధన్ బస్టాండ్, పవన్ థీయేటర్, తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ జలమయం కాగా, ఇళ్లల్లోకి నీరు చేరింది. నగరంలో నాలాలపై నిర్మించిన నిర్మాణాల ప్రాంతాల్లో వర్షం కారణంగా ఇబ్బందులేర్పడ్డాయి. నాగారం, గాంధీ చౌక్, ఖలీల్ వాడి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీరు చేరి జనజీవనం స్తంభించిపోయింది. సోమవారం రాఖీ పౌర్ణిమ కావడంతో అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి వెళదామనుకున్న వారు వర్షం కారణంగా వెళ్ళలేకపోయారు. కొంతమంది ఇబ్బందిగా ఉన్నా వర్షంలోనే వెళ్లారు.

నిజామాబాద్ నుంచి ఆర్మూర్, హైదారాబాద్, కామారెడ్డి, నందిపేట్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, అటు నుంచి నిజామాబాద్ వైపుకు వచ్చే బస్సులు యూ ఆర్ బీ కింద నీరు భారీగా చేరడంతో రాకపోకలు కొద్దిసేపు స్తంభించాయి. దీంతో దారి మళ్లించి నాందేవ్ వాడ మీదుగా బస్టాండు వరకు నడిపారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత ఇల్లు కుండ పోత వర్షం ధాటికి ఇంటి పైకప్పు నుంచి జల్లెడలా వర్షం ఇంట్లోకి కురిసింది. దీంతో పలు ఇళ్లల్లో బట్టలు వస్తువులు, బియ్యం పప్పులు తడిసిపోయాయి.


Similar News