కామారెడ్డి ఘటనలో విచారణ కొనసాగుతోంది
తెలంగాణలో సంచలనంగా మారిన కామారెడ్డి కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.
దిశ, కామారెడ్డి : తెలంగాణలో సంచలనంగా మారిన కామారెడ్డి కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై కేసు విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చెరువులో ఆత్మహత్యలు జరిగే రోజు ప్రత్యక్ష సాక్షులు లేరన్నారు. చెరువులో కాలు పెడితేనే లోతుకు వెళ్లేలా ప్రమాదకరంగా ఉందని తెలిపారు. అటువంటి సమయంలో జరిగిన ఆత్మహత్యలు ఏ విధంగా జరిగాయో తెలియవన్నారు. ఆత్మహత్యలా..లేక అనుకోకుండా జరిగిందా లేక కాపాడే క్రమంలో జరిగిందా అనేది నిర్దారించలేమని తెలిపారు. కానిస్టేబుల్ శ్రుతి గర్భవతి కాదని, రిపోర్టులో అలాంటిదేమి రాలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక, ముగ్గురి మొబైల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామన్నారు. ఘటనలకు ముందు ఎవరి దగ్గరి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. కేసు విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.