భార్య, పిల్లల్నిపెళ్లికి పంపి..ఆత్మహత్య చేసుకున్న భర్త
కుటుంబ పోషణ కోసం అప్పు చేసి తీసుకున్న ఆటోకు గిరాకీ లేక, నెలవారీ కిస్తీలు కట్టలేక ఆటో డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, నవీపేట్ : కుటుంబ పోషణ కోసం అప్పు చేసి తీసుకున్న ఆటోకు గిరాకీ లేక, నెలవారీ కిస్తీలు కట్టలేక ఆటో డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని మొకన్ పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ టిక్ కర్ణ (35) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో అప్పులు చేసి దుబాయి వెళ్లినా, అక్కడ పని సరిగ్గా లేకపోవడంతో తిరిగివచ్చాడు. ఫైనాన్స్ లో ఆటో తీసుకొని నడిపించేవాడు. గిరాకీ లేక, కిస్తీలు కట్టలేక, గతంలోని అప్పులు పెరిగిపోవడంతో మదనపడేవాడు. ఆదివారం భార్య, పిల్లలు బంధువుల పెళ్లికి వెళ్లగా.. తాను తరువాత వస్తానని చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.వినయ్ తెలిపారు.