ఆ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొట్టమొదటి యువకుడు..
ఉపాధి కోసం ఆ గ్రామంలో ఉండే పురుషులంతా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన
దిశ, మాచారెడ్డి: ఉపాధి కోసం ఆ గ్రామంలో ఉండే పురుషులంతా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన చరిత్ర. ఆ సమయంలో ఆ గ్రామం లో వృద్ధులు మహిళ లే కనిపించేవారు. ఉన్నత చదువులు చదవి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే తపన కనబరచలేదు. మారిన పరిస్థితులకనుగుణంగా నేటి తరం విద్యలో రాణిస్తున్నారు.
ఇప్పటివరకు ఆ గ్రామం నుండి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి లేడు. ఇన్నాళ్లకు ఇటీవల జరిగిన గ్రూప్ 4 లో ఉద్యోగం సంపాదించి, గ్రామంలో ఒకే ఒక్కడు గా నిలిచాడు కామారెడ్డి జిల్లా ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన రసమల్లు మల్లయ్య-గంగమణి ల కుమారుడు మహేష్. 1600 జనాభా కలిగిన ఆ గ్రామం నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి లేడు. ఆ గ్రామం కామారెడ్డి - సిరిసిల్ల 11వ రాష్టీయ రహదారి నుండి 2కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైమరీ విద్య మాత్రమే ఆ గ్రామంలో ఉంది. సెకండరీ విద్యాభ్యాసం చేయాలంటే 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి.
మహేష్అనే యువకుడు కష్టపడి ఉన్నత విద్యనభ్యసించి గ్రూప్ 4 లో సత్తా చాటి ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ లో ఉద్యోగం సాధించాడు. ఇన్నాళ్లకు గ్రామానికి చెందిన యువకుడు గ్రూప్ 4 లో ఉద్యోగం సాధించడం గ్రామానికి గర్వంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ కొత్త అరవింద్ గ్రూప్ 4 ఉద్యోగం సాధించిన యువకుడు మహేష్ ను అభినందించారు. మహేష్ ను ఆదర్శంగా తీసుకుని గ్రామానికి చెందిన విద్యార్థులు, ఉన్నత చదువులు అభ్యసించే యువతీ యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా పట్టుదల తో ఉన్నత ఉద్యోగాలు సాధించి గ్రామానికి కీర్తి ప్రతిష్ఠలు తేవాలని ఆయన ఆకాంక్షించారు.