పైసలివ్వందే కదలని ఫైలు.. ఏసీబీ మరో అ(పి)డుగు ఇంకెవరి వైపో?
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అసలు సిసలైన కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్:నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అసలు సిసలైన కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. 60 డివిజన్ల పరిధిలో కలిగిన ఈ కార్పొరేషన్‌లో ఏ చిన్న పని జరగాలన్నా అధికారి చేయి తడపందే ఏ ఒక్క పని కూడా జరగదని నగర ప్రజలు ఎవరిని అడిగినా చెప్పే మాట ఇది. బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, ఆఖరుకు డెత్ సర్టిఫికెట్ కావాలన్నా ముడుపులివ్వాల్సిందే. కార్పొరేషన్‌లో పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగి కైనా ఎంతో కొంత ముట్ట చెప్పుకోవాల్సిందేనన్నది బహిరంగ రహస్యం. తుఫాన్ వేగంతో విస్తరిస్తున్న నగరంలో వందల సంఖ్యలో ఇళ్లు, అపార్ట్మెంట్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొత్త ఇంటి నిర్మాణం పర్మిషన్‌కు దరఖాస్తు చేసుకుంటే నిర్మించబోయే ఇంటి స్థాయిని బట్టి, ఇంటి యజమాని ఆర్థిక స్తోమతను బట్టి పర్మిషన్ కోసం లక్షల ముట్ట చెప్పుకోవాల్సిందే. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా, నిబంధనలకు లోబడి ఇంటిని నిర్మించుకుంటున్నా ఏవేవో కొర్రీలు సృష్టించి, పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం అధికారులకు, సంబంధిత కార్పొరేటర్లకు అలవాటుగా మారింది.
నోట్ల కట్టలు చేతిలో పెడితే, కార్పొరేషన్ జాగాను కబ్జా చేసి నిర్మిస్తున్న బిల్డింగ్ కైనా ఎంచక్కా పర్మిషన్ ఇస్తారనే టాక్ ఉంది. కార్పొరేషన్ లో పనిచేసే చిన్న స్థాయి ఉద్యో గుల్లో కొందరు రోజుకు కనీసం రూ. 5 వేలైనా పై పైన సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకొని మరి పని చేస్తారనేది కార్పొరేషన్ ఉద్యోగులే చెప్పుకుంటున్న మాటలు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్ లో పని చేసే ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో అక్రమార్జన పైనే దృష్టి సారించినట్లు కొందరు కార్పొరేటర్‌లే లోగుట్టుగా చెప్పడం గమనార్హం. తాజాగా మున్సిపల్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ భారీ స్థాయిలో నగదు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలతో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు హై టెన్షన్ కరెంట్ షాకు తగిలినట్లయింది.
అవినీతి, అధికారులకు ప్రజాప్రతినిధుల అండ కార్పొరేషన్‌లో కొలువుదీరిన అవినీతి అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులే కొండంత అండగా ఉండి వారి అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధుల పనులు చక్కబెడుతూ అధికారులు దర్జాగా లక్షల్లో ముడుపులు దండుకుంటున్నట్లు సమాచారం. కొందరు కార్పొరేటర్లు అవినీతి అధికారుల ద్వారానే ముడుపులు తీసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అధికారుల అవినీతి, కార్పొరేటర్లకు, కార్పొరేటర్ల అవినీతి అధికారులకు పరస్పరం తెలియడంతో, అవినీతి దందాలు కొందరు కార్పొరేటర్లు, అధికారులు కలిసే చేస్తున్నట్లు ఓపెన్ టాక్. ప్రజల నుంచి అధికారులకు ఏదైనా సమస్య వస్తే కార్పొరేటర్ లే మధ్యవర్తులుగా ఉండి అధికారులను కాపాడుతూ వస్తున్నారు. కార్పొరేటర్లు చెప్పిన పనులకు తలొగ్గని అధికారులను భయపెట్టి కార్పొరేటర్లు తమ వైపు తిప్పుకొని అనుకున్న పనులు జరిపించుకుంటున్నారు.
నిజాయితీగా ఉందామనుకున్నా ఉండలేని పరిస్థితులు ఉన్నాయని, కొందరు అధికారులు వాపోతున్నారు. గతంలో మున్సిపల్ ఇంజనీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడినప్పుడు తానుంటున్న భవనం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఆ అధికారిని కొందరు ప్రజాప్రతినిధులే టార్గెట్ గా చేసి పథకం ప్రకారం ఏసీబీ అధికారులకు పట్టిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు లోని ఉద్యోగం చేయలేని స్థితిలో బదిలీపై వెళ్దామనే ఆలోచనల్లో ఉండగానే మున్సిపల్ ఇంజనీర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ ఉద్యోగి ఏసీబీ అధికారుల సమక్షంలోనే వారిని ఏ మార్చి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇన్నాళ్లు నరేందర్‌ను కాపాడింది ఆయన నోటి మాటే..
సాధారణ బిల్ కలెక్టర్‌గా మొదలైన ఆయన ఉద్యోగ ప్రస్థానం మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ అధికారిగా ఎదిగింది. దీర్ఘకాలంగా మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న నరేందర్ ను ఇప్పటివరకు కాపాడింది ఆయన నోటి మాటేనని అందరూ అంటున్నారు. కార్పొరేషన్ లో ఎవరు ఆయన వద్దకు ఏ పని మీద వెళ్లినా తను ఎంత పని ఒత్తిడిలో ఉన్న వచ్చిన వ్యక్తులతో ప్రేమగా, వరుసలు కలుపుతూ మాట్లాడే నరేందర్ అంటే అందరికి అభిమానమే. ఎంతటి పనైనా తన వద్దకు వెళ్తే అయిపోతుందని, తన పరిధిలో లేకుండా ఇతరులకు చెప్పే నా పని చేయిస్తాడనే నమ్మకం చాలామందిలో ఉంది. తన తోటి ఉద్యోగులతో, అధికారులతో, కింది స్థాయి సిబ్బందితో, నగర ప్రజలతో, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులతో అందరితో తలలో నాలుకలా ఉండే నరేందర్ పై ఎవరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయకపోయినా, సంబంధిత అధికారుల దృష్టిలో చాలా కాలంగా ఉన్నట్లు తెలిసింది. ఉన్నతాధికారి సివి ఆనంద్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై జరిపిన దాడిలో అనూహ్యంగా నరేంద్ర పట్టుబడ్డాడు.
జిల్లా చరిత్రలో ఇదే అతిపెద్ద కేసు..
జిల్లాలో ఏసీబీ రైడ్స్ కొత్తేం కాదు. ఇదివరకు చాలా సార్లు వివిధ స్థాయి ఉద్యోగులు ఏసీబీ అధికారుల తనిఖీలు పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో ముడుపులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే, మరికొన్ని కేసుల్లో ఆదాయానికి మించి సంపాదించిన అక్రమాస్తుల కేసులో పట్టుబడ్డ కేసులు చాలానే ఉన్నాయి. కానీ, నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నంత పెద్ద మొత్తంలో జిల్లాలో ఇదివరకు పట్టుబడిన దాఖలాలు లేవు. రెండేళ్ల క్రితం ఏసీబీకి చిక్కిన ఓ తహసీల్దార్ ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన నగదు ఆస్తి పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఇదే పెద్ద కేసుగా ఉంది. తాజాగా నరేందర్ కేసు జిల్లా రికార్డును బ్రేక్ చేసిందనే చెప్పవచ్చు.