పోలీసు శాఖలో రచ్చ చేస్తున్న హడావుడి బదిలీలు..
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన బదిలీల వ్యవహరం హాట్ టాఫిక్ గా మారింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన బదిలీల వ్యవహరం హాట్ టాఫిక్ గా మారింది. మార్చి నెలలో జరిగిన పోలీసు కానిస్టేబుల్ మొదలుకుని ఏఎస్సైల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీల ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. పదుల సంఖ్యలో జరిగిన పోలీసు సిబ్బంది స్థానచలనంపై తలోదిక్కుగ చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏడేళ్లుగా కదలకుండా విధులు నిర్వహించిన ఇద్దరు సిబ్బందికి మార్చినెలలో బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకుని వారికి కేటాయించిన స్థానానికి చేరకముందే తిరిగి రద్దు చేసి అక్కడే పోస్టింగ్ లు ఇవ్వడం పై ఖాకీల్లో అసహనం వ్యక్తమౌతుంది.
సాధారణంగా మూడేళ్లు ఒకచోట పని చేసిన వారిని, ఐదేళ్లు పూర్తి చేసిన వారిని కచ్చితంగా బదిలీ చేయాల్సిందే. పోలీసు కమిషనర్ కు కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైల బదిలీ అధికారం ఉంది. ఏస్సైల నుంచి పై అధికారుల బదిలీల వరకు వెస్ట్ జోన్ ఐజీ నుంచి డీజీపీ వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆఖరి సంవత్సరం ముగింపునకు ముందు వేసవి సెలవులు ప్రారంభానికి ముందే చాలా మంది పోలీసుశాఖలో ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న వారు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. కమిషనర్ కు అధికారం ఉండడంతో ఈ ప్రక్రియను ఆయన కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. అందుకు దరఖాస్తులను తీసుకుని పరిశీలించి స్థానచలనానికి అవకాశం ఇచ్చారు.
కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఐదేళ్లు నిండిన వారిని స్థానచలనం చేసి రూల్స్ పాటించారు. కానీ కొన్నిచోట్ల రూల్స్ కు విరుద్దంగా బదిలీ చేయడం, చేసిన వారికి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం పై సిబ్బంది లబోదిబోమంటున్నారు. కొందరి కనుసన్నుల్లోనే బదిలీలు జరిగాయని చెప్పుకుంటున్నారు. గతంలోనూ కానిస్టేబుళ్ల బదిలీలకు నిజామాబాద్ లో మంత్రి మొదలుకుని ఎమ్మెల్యేల వరకు సిఫారసు లేటర్ లను ఇచ్చిన చరిత్ర నిజామాబాద్ జిల్లాలో ఉంది. 2020 సంవత్సరం ఆరంభంలోనే ఒక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే బదిలీలకు 27 సిఫారసు లేటర్లు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. శుక్రవారం వరకు జరిగిన బదిలీల్లోనూ ఒత్తిడి ఉంది అని వాదనలు ఉన్నాయి. కొందరు ఉన్నతాధికారులు కనుసన్నుల మేరకే ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకే బదిలీలు జరిగాయని పోలీసు శాఖ కోడైకూస్తోంది.