కొట్టొద్దు టీచర్‌..

ఉదయం వెళితే.. సాయంత్రం వరకూ గడిపేది గురువు సన్నిధిలోనే.. ఈ వేగవంతమైన, ఆధునిక కాలంలో పసివారి పై గురువుల ప్రభావమే ఎక్కువ.

Update: 2024-12-14 03:22 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉదయం వెళితే.. సాయంత్రం వరకూ గడిపేది గురువు సన్నిధిలోనే.. ఈ వేగవంతమైన, ఆధునిక కాలంలో పసివారి పై గురువుల ప్రభావమే ఎక్కువ. శిలను శిల్పంగా తీర్చిదిద్దాలన్నా, బండరాయిని చేసి బయట పడేయాలన్నా.. వారి చేతుల్లోనే ఉంటుంది. బాల్యం అత్యంత సున్నితమైనది. విద్యాబుద్ధులు నేర్పే గురువులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి.. విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలి.. చదువుతో పాటు సంస్కారం, సహనం, మంచి నడత నేర్పాలి.. ఒత్తిడిని తట్టుకొని నిలబడే తత్వంతో పాటు సహనం విలువ నేర్పాలి. సంస్కారం గొప్పదనాన్ని వివరించాలి. ఇలాంటి గొప్ప లక్షణాలను చూసి విద్యార్థులు నేర్చుకునేలా గురువులు మెదలాలి. కానీ, చాలా మంది గురువుల్లో సహనం నశిస్తోంది. విద్యార్థుల్లోని చిన్నపాటి తప్పులకు కూడా సహనాన్ని కోల్పోయి కంట్రోల్ తప్పుకున్నారు. విద్యార్థుల వయసును కూడా చూడకుండా చితకబాదుతున్నారు. మందలించి దారికి తెచ్చుకునే ఓపిక లేని కొందరు మహిళా టీచర్లు ఇష్టారీతిన చితకబాదుతున్నారు. పిల్లల శరీరంపై వాతలు తేలేలా కొడుతున్నారు. పిల్లల శరీరంలో లేత ఎముకలు విరిగి పోతాయేమోనని స్పృహ కూడా లేనంతగా కొడుతున్నారు.

నిజామాబాద్ నగరంలోని దుబ్బ జిల్లా పరిషత్ హై స్కూల్ లో గణిత టీచర్ గా పనిచేస్తున్న కల్పన అనే టీచర్ దురుసు ప్రవర్తన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆగ్రహానికి గురైంది. టీచర్ కల్పన కొట్టడంతో పదో తరగతి విద్యార్థిని జి. అశ్విత చేయి విరగడం తీవ్ర విమర్శలకు గురైంది. నాలుగైదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన పై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగగా, టీచర్ విద్యార్థినిని చేయి విరిగేలా కొట్టడం తీవ్రమైన చర్యగా ఉపాధ్యాయ వర్గాల్లోని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. విద్యార్థులను తమ బిడ్డల్లా చూసుకోవాల్సిన మహిళా టీచర్లు విద్యార్థుల పట్ల ఇలా అమానుషంగా ప్రవర్తించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. సదరు టీచర్ ను మానసిక నిపుణులకు చూపించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై మీడియా సదరు టీచర్ కల్పనను ప్రశ్నిస్తుండగా తను చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాపం ఆమె ముఖంలో కనిపంచడం లేదని, బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు అంటుండగా ఓపక్క మీడియాతో మాట్లాడుతూనే పళ్లు కొరకుతూ పేరెంట్స్ ను ఉరిమి చూడటం ఆమె మానసిక పరిస్థితి పై సందేహం కలుగుతోందని విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేశారు. మీడియాకు నిర్లక్ష్య ధోరణితో సమాధానమివ్వడంపై పలువురు మండిపడ్డారు.

సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలోనే ఇలాంటి ఘటనలు గతంలో ఎక్కువగా జరిగాయి. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు అక్కడక్కడా ఎప్పుడో కానీ జరగవు. ఒంటిపై వాతలు కనిపించేలా కొట్టిన సందర్భాలు కొన్ని అక్కడక్కడా జరిగినా చేయి విరిగేంతగా కొట్టడం మాత్రం ఇటీవలి కాలంలో ఇదేనని పలువురు పేర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ స్కూల్ లో తొమ్మిదో తరగతి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తొమ్మిదో తరగతి విద్యార్థి శివ జశ్విత్ రెడ్డి అనే తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోవడం కూడా కొద్ది రోజుల క్రితం తీవ్ర సంచలనం రేపింది.

మాలలో ఉన్న విద్యార్థి చొక్కా పట్టుకున్న మహిళా టీచర్..

నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్ లో మహిళా ప్రిన్సిపాల్ ఇటీవల అయ్యప్ప మాలలో ఉన్న ఓ విద్యార్థి చొక్కా పట్టుకుని దండించింది. జరిగిన పొరపాటును తెలుసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఈ విషయం బైటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. విద్యార్థులు హోం వర్క్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఉద్దేశంతో మందలింపుగా తను అందరినీ చొక్కా పట్టుకుని మందలించినట్లుగానే పొరపాటున మాలలో ఉన్న విద్యార్థి చొక్కా కూడా పట్టుకున్నానని చెప్పి ప్రిన్సిపాల్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఈ విషయం బైటికి పొక్కలేదు. లేదంటే ఈ విషయం రచ్చరచ్చయి హిందూ సంఘాలు ఆందోళన చేసే దాకా వెళ్లేది. జరిగిన తప్పును తెలుసుకుని సర్ధుకోవడంతో సద్దుమణిగింది. కానీ, దుబ్బ ప్రభుత్వ హైస్కూల్ టీచర్ తను చేసిన తప్పును సమర్థించుకోవడం తీవ్ర వివాదాన్ని రేపుతోంది.

పైగా పేరెంట్స్ పై కూడా దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలతో ఆగ్రహానికి గురైన బాధితుల ఫిర్యాదు పై పోలీసులు టీచర్ కల్పన పై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇటీవలి కాలంలో మహిళా టీచర్లు కంట్రోల్ తప్పి విద్యార్థినులను అమానుషంగా తిడుతున్నారని, మానసికంగా బాధపడేలా వారి క్యారెక్టర్‌ అనుమానించేలా మాట్లాడుతున్నారని పలువురు విద్యా్ర్థినులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. వాటిని కొందరు తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్ దృష్టికి తెస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మీడియా దృష్టికి, విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకెళితే తమ పిల్లలనే బద్నాం చేసుకున్నట్లవుతుందనే అభిప్రాయంతో మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఈ విషయం పై అంతర్గత విచారణ జరిపి ఇలాంటి కంట్రోల్ తప్పుతున్న టీచర్లపై చర్యలు తీసుకోవాలని, లేదంటే కనీసం వారిలో మార్పును తీసుకు రావాలని తల్లిదండ్రలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.


Similar News