చిన్నారి నిఖిలేష్‌కు అండగా నారాయణ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు..
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామానికి

దిశ,ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన ముస్కు నవీన్ రెడ్డి -మనోజ దంపతుల కుమారుడైన చిన్నారి నిఖిలేష్ కు బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిన్నారి రోగం నయానికి ఆ వారి తల్లిదండ్రులు రూ.లక్షల పైచిలుకు ఖర్చు చేయగా మరో 60 లక్షల పైచిలుకు నగదు అవసరముందని వైద్యులు చెప్పారు. దీంతో ఆ చిన్నారి దంపతులు ఆర్థిక సాయం చేసి వారి కొడుకు ప్రాణాన్ని కాపాడాలని పలు పత్రికలతో పాటు పలు సోషల్ మీడియాల్లో వేడుకున్నారు.
దీంతో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆ చిన్నారి చదువుకునే నారాయణ హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తలా కొంత చేయి వేసి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. కొంచెం కొంచెం పోగు చేసి వారి కుటుంబ సభ్యులకు బుధవారం నారాయణ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు రూ.ఒక లక్ష 70 వేల నగదును అందజేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు సన్నిహితులు కూడా ఈ చిన్నారి ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం పేర్కొంది. ఇది అంతా బాగుంది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు ఎన్నిక గల నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలు చదువుకుంటున్న ఈ చిన్నారి నిఖిలేష్ అకస్మాత్తుగా ఒక బెడ్ క్యాన్సర్ రోగానికి గురి అయ్యాడు.
కానీ ఉమ్మడి రాష్ట్రంలో అంత పేరెన్నిక గల నారాయణ విద్యా సంస్థ ల యాజమాన్య ప్రతినిధులు స్పందించి ఆ చిన్నారికి వైద్య సేవలు అందించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ నారాయణ పాఠశాల యాజమాన్య ప్రతినిధులు ఆ చిన్నారి నిఖిలేష్ వ్యాధితో నెల రోజులుగా బాధపడుతున్న స్పందించి ఎలాంటి ఆర్థిక సాయం చేయక పోవడం గమనార్హం. ఎంతో పేరెన్నిక కలిగిన నారాయణ కార్పొరేట్ పాఠశాల అయి ఉండి కూడా.. వారి విద్యా సంస్థలు చదువుతున్న ఓ చిన్నారి నిరుపేదకు అకస్మాత్తుగా ఓ భారీ రోగం తగిలి ఇబ్బందులు పడుతున్న ఆ పాఠశాల యాజమాన్య ప్రతినిధులు స్పందించకపోవడం పట్ల ఆర్మూర్ ప్రాంతంలో ఆ పాఠశాల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రజల నుంచి డబ్బులు గుంజడానికి ఉన్నాయి కానీ ప్రజల బాగోగులు చూసేందుకు కనీసం వారికి మానవతా దృక్పథం లేకుండా పోయిందని చర్చ ఆర్మూర్ ప్రజల్లో జోరుగా జరుగుతుంది.