నిలిచిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు.. పూర్తయ్యేదెప్పుడో..?
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బంజపల్లి గ్రామ పంచాయతీ భవనం
దిశ,నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బంజపల్లి గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో రూ. 20 లక్షలలతో మంజూరు అయ్యాయి. గత 2019వ సంవత్సరం నుండి బంజపల్లి గ్రామ పంచాయతీ కార్యకలాపాలు గ్రామంలోని బీసీ కమిటీ హాలులో నిర్వహిస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులు గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు.
అర్ధాంతరంగా నిలిచిన పనులతో గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీ నిర్మాణం పనులు నిలిచిపోయి కొన్ని నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. నూతన భవనం నిర్మాణం పనులు చేపట్టిన అధికారుల నిర్లక్ష్యంతో అర్థాంతరంగా పనులు నిలిచిపోయాయి. సంవత్సరాలు గడిచినా పనులు మాత్రం సాగడం లేదు. నత్త నడక నేర్పినట్లు అధికారుల నిర్లక్ష్యం ధోరణికి బంజపల్లి గ్రామ పంచాయతీ అసంపూర్తి భవనం నిర్మాణం పనులు నిదర్శనం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బంజపల్లి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు పరిపాలన సులభతరం చేయాలని మండల కేంద్ర ప్రజలు కోరుతున్నారు.