తెలంగాణలో కమ్యూనిటీ మీడియేటర్ల సేవలు.. శిక్షణ తరగతులు ప్రారంభం

తెలంగాణలో కమ్యూనిటీ మీడియేటర్ల సేవలు ప్రారంభమయ్యాయి..

Update: 2024-08-22 08:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఆగస్టు 22: సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో తొలిసారిగా 2021లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో, దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ సామాజిక వర్గాల నుండి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణ తరగతులను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే లాంఛనంగా ప్రారంభించగా, హైకోర్టు న్యాయమూర్తులు సుజోయ్ పాల్, కె.సురేందర్, జె.శ్రీనివాస్ రావు భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. సామాజిక వివాదాలు, కుటుంబ తగాదాలు వంటి వాటిని కమ్యూనిటీ మీడియేటర్లు (వాలంటీర్లు) మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల సామాజిక వివాదాల సత్వర పరిష్కారానికి క్షేత్రస్ధాయిలోనే ఆస్కారం ఉంటుందని అన్నారు. తద్వారా అనవసర ఖర్చుతో పాటు, సమయం వృధా కాకుండా అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనేందుకు కూడా ఈ వ్యవస్థ దోహదపడుతుందని అన్నారు. శిక్షణ పొందిన వాలంటీర్లు తమతమ ప్రాంతాలలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని, పరస్పరం ఆమోదయోగ్యమైన రీతిలో వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను శ్రద్ధగా ఆకళింపు చేసుకుని, సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని, ప్రయోగాత్మకంగా అమలులోకి తెస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలు అందించేలా అంకితభావంతో కృషి చేయాలని కమ్యూనిటీ మీడియేటర్లకు హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్, రిటైర్డ్ సెషన్స్ జడ్జి మొహమ్మద్ షమీమ్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరీ, నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీతా కుంచాల, కామారెడ్డి సెషన్స్ జడ్జి వి.ఆర్.ఆర్.వరప్రసాద్, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, న్యాయాధికారులు, రెండు జిల్లాలకు చెందిన కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గొన్నారు


Similar News