మూన్నాళ్ల ముచ్చటేనా..?

కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వెళ్లే రహదారి గుంతల మయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది.

Update: 2024-07-03 11:43 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వెళ్లే రహదారి గుంతల మయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలు పడి నీళ్లు నిండితే గుంతలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో రహదారి ఉంది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ రోడ్డును పరిశీలించి తాత్కాలికంగా ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు. బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వెళ్లే టర్నింగ్ వద్ద ఏర్పడిన భారీ గుంతను కంకర సిమెంటుతో మూసేయించి దారి పొడుగునా ఉన్న గుంతల్లో కేవలం కంకర పొడి సిమెంట్ వేసి చేతులు దులుపుకున్నారు. కంకర సిమెంటుతో పూడ్చేసిన గుంత బాగానే ఉన్నా మిగతా దారిలో ఉన్న గుంతల్లో వేసిన కంకర సిమెంట్ వర్షం ధాటికి కొట్టుకుపోయి మళ్ళీ గుంతలు ఏర్పడ్డాయి.

దాంతో చేసిన పనులు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు ఈ రహదారి పునర్నిర్మాణానికి నిధులు మంజూరైన ఎన్నికల కోడ్ తో రోడ్డు పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం ఆ నిధులు ఉన్నాయో.. లేదో తెలియదు. మళ్ళీ నిధులు మంజూరయ్యే వరకైనా ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గుంతలు పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. కలెక్టరేట్ కు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంతల్లో ఎవరైనా పడిపోయి ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కలెక్టరేట్ ప్రధాన రహదారిపై గుంతలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News