Nizamabad CP : విపక్షాల ఆందోళనకు అనుమతి లేదు..ఆర్మూర్‌లో నిషేధాజ్ఞలు
బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ఐక్య కార్యాచరణ కమిటీ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తా లో నిర్వహించ తలపెట్టిన ఛలో ఆర్మూర్, రాస్తారోకో లకు ఎలాంటి అనుమతిని ఇవ్వలేదని సీపీ కల్మేశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ ప్రాంతంలో ఈనెల 23న సాయంత్రం నాలుగు గంటల నుంచి 25న ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని సీపీ అన్నారు. అయిదుగురి కన్నా ఎక్కువగా ఒకచోట ప్రజలు గుమికూడి ఉండకూడదని ఆంక్షలు విధించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశాలు, రాస్తారోకో, ధర్నాల వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని సీపీ ప్రకటనలో హెచ్చరించారు.
రైతులందరికీ రుణమాఫీ కోసం..
రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలనే డిమాండుతో విపక్ష పార్టీలు శనివారం ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకోకు సిద్ధమయ్యాయి. కొద్దిరోజుల ముందు నుంచే ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన రైతులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళనకు కార్యాచరణను రూపొందించాయి. ఇందులో భాగంగా ఈనెల 24న ఛలో ఆర్మూర్ పేరున ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాల్లోని అన్ని గ్రామాల నుంచి ఇంటికి ఇద్దరు చొప్పున రైతులు మామిడిపల్లి చౌరస్తాలో నిర్వహించనున్న రాస్తారోకో ఆందోళనలో పాల్గొనేందుకు రావాలని బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ఐక్య కార్యాచరణ కమిటీగా పిలుపు నిచ్చాయి. పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ రూపొందించాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. గతంలో రైతు సమస్యలపై ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన పలు ఆందోళనల తాలూకు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఐక్య కార్యాచరణ కమిటీ వేసే ప్రతి అడుగును గమనిస్తోంది. ఈ క్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.