ధరణిలో సమస్యలను పరిష్కరించేందుకే.. భూ రికార్డులపై కొత్త ఆర్వోఆర్‌: కలెక్టర్

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.

Update: 2024-08-25 02:22 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ధరణి సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం-2024 ముసాయిదాపై వివిధ వర్గాల వారి అభిప్రాయాలను సేకరించేందుకు శనివారం సమీకృత జిల్లా కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో చర్చా వేదిక కొనసాగింది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీహనుమంతు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చర్చా వేదిక ద్వారా వెల్లడైన అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రజల నుంచి సీసీఎల్ఏ వెబ్ సైట్ ద్వారా సూచనలు, సలహాలు స్వీకరించాలని తెలిపారు.

జిల్లా స్థాయిలో మేధావులు, రెవెన్యూ చట్టంపై అవగాహన కలిగి ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు సైతం తమ దైనందిన విధుల నిర్వహణ సందర్భంగా గమనించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన ముసాయిదా చట్టంలోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డిలు మాట్లాడుతూ, ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదా చట్టాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో చట్టాల అమలు పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూరేలా, సత్వరమే వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా నూతన చట్టం దోహదపడాలని ఆకాంక్షిస్తూ, ఈ దిశగా అధికారులందరూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపర్చారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, ఆయా మండలాల తహసీల్దార్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డితో పాటు న్యాయవాదులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరై నూతన రెవెన్యూ చట్టంలోని ముసాయిదా అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. భూ సంబంధిత అంశాలతో కూడిన సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి, ఆర్డీఓలకు అప్పిలేట్ అథారిటీ అధికారం కల్పించాలన్నారు. చర్చా వేదికకు హాజరైన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులకు, న్యాయవాదులకు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులకు, రైతులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. చర్చా వేదికలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, అంబదాస్ రాజేశ్వర్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరైన పలువురి అభిప్రాయాలు:

సాగులో ఉన్న రైతులకు పట్టాలు చేసి ఇవ్వాలి...

ఎన్నో ఏళ్లుగా అసైన్మెంట్ భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఆ భూమిని తమ పేరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది. రైతుల మధ్య గొడవలు జరిగి, దారుణాలు జరుగుతున్నాయి. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న అసైన్మెంట్ భూములను సాగులో ఉన్న వారికి పట్టాలు చేసి హక్కులు కల్పించాలి.

మ్యుటేషన్ వివాదాలు స్థానికంగా పరిష్కరించే వ్యవస్థ రావాలి...

భర్త చనిపోతే ఆయన పేరున ఉన్న భూమి భార్య పేరున మార్చాలనుకున్నపుడు మ్యుటేషన్ లో వివాదాలుంటే తహసీల్దార్ వద్ద పరిష్కారమయ్యేవి. కానీ, ఏ వివాదమున్నా ఇప్పుడు సీసీఎల్ కు పొమ్మంటున్నారు. హైదారాబాద్ కు పోవాలంటే సామాన్యులకు ఎంతో భారంగా ఉంటది. వీఆర్ఓ వ్యవస్థ కూడా తీసేశారు. తహసీల్దారే సబ్ రిజిస్ట్రార్ అయ్యిండు. ఫీల్డ్ లెవెల్లో ఎంక్వయిరీ చేయాలంటే గిర్దావర్ ఒక్కడే ఎన్నని చేస్తాడు. అందుకే జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వీఆర్ఓ వ్యవస్థ లేకుండా రెవెన్యూ వ్యవస్థ కొనసాగితే ఇబ్బందులు తప్పవు. పాతకాలం చట్టాలు మార్చాలి. రెవెన్యూ శాఖలో ఇప్పటికే కొన్ని బ్రిటీష్ కాలం నాటి పద్ధతులే కొనసాగుతున్నాయి. వాటిని మన సౌకర్యానికి అనుకూలంగా పకడ్బందీగా మార్చాల్సిన అవసరం ఉంది.


Similar News