నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా మార్చుదాం

నిజామాబాద్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పిలుపునిచ్చారు.

Update: 2024-08-28 11:44 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ, న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు, ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్​ ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

    పరేడ్ గ్రౌండ్ నుండి కోర్టు కాంప్లెక్ చౌరస్తా వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సీపీలు సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీస్ కళాజాతా బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ...ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని, చట్ట ప్రకారం మూడేళ్ల వరకు కారాగార శిక్ష, రూ. 25 వేల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదన్నారు. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని జిల్లా జడ్జి హితవు పలికారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్నచిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగల్చవద్దని విద్యార్థులకు హితవు పలికారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ...రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90 శాతం వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచించారు.

    ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా అనేకమంది విద్యార్థులు, యువత సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారని, ఇంకా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. ఈ వైఖరిని విడనాడి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమ కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి, బంధువులకు కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు ఎంత చేసినా వారికి కలిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నిజామాబాద్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

     పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో గతేడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్రవాహనదారుల సంఖ్యనే అధికంగా ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రమాదాల తీవ్రతను గుర్తించి వాటి బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. వాహనాల సంఖ్య పరంగా చూసినా టూవీలర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం వాహనాల సంఖ్య 447923 కాగా, అందులో ద్విచక్ర వాహనాలు 370789 ఉన్నాయని అన్నారు. అత్యధిక మంది హెల్మెట్ ధరించకుండా టూవీలర్స్ నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిలో 55 శాతానికి పైగా యువతనే బాధితులుగా ఉంటున్నారని సీపీ ఆవేదన వెలిబుచ్చారు.

    హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం బారి నుండి తమనుతాము కాపాడుకోవచ్చని హితవు పలికారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలను ముమ్మరం చేశామని, అయితే ఎవరికివారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని పిల్లలకు విద్యార్ధి దశ నుండే అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు, గురువులను కోరారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం అనర్ధదాయకమని జాగ్రత్తలు సూచించారు. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే, తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ వర్ణనాతీతమని, తీవ్ర గాయాలపాలై అచేతనావస్థకు చేరితే ఇతరులపై ఆధారపడి జీవితం గడపాల్సి రావడం ఎంతో దుర్భరంగా ఉంటుందని గుర్తు చేశారు.

     ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గా, టి.శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం.శ్రీకాంత్ బాబు, పి.పద్మావతి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కె.గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బూ ఉపాధ్యాయ్, పి.శ్రీనివాస్ రావు, మేజిస్ట్రేట్లు వి.హరికుమార్, చైతన్య, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎంవీఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News