భూ వివాదాల పరిష్కారం ఎప్పుడో..?
జిల్లాలో పట్టా భూములతో పాటు అసైన్మెంట్ భూముల్లోను
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో పట్టా భూములతో పాటు అసైన్మెంట్ భూముల్లోను హద్దుల సమస్యలు, ఆక్రమణల వివాదాలున్నాయి. వీటిల్లో ఎక్కువగా పట్టా భూముల్లో కన్నా, అసైన్మెంట్ భూముల్లోనే ఎక్కువ వివాదాలున్నాయి. ఎన్నో యేళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా రైతుల మధ్య తీవ్ర విభేదాలకు, శతృత్వాలకు ఇవి ఆజ్యం పోస్తున్నాయి. భూతగాదాలు తలెత్తినప్పుడు ముందుగా ఊళ్లోనే సమస్యను పరిష్కరించుకోవడానికి నలుగురి సమక్షంలో పంచాయతీ పెడుతున్నారు. అక్కడ పేచీ తెగకపోతే గొడవకు దిగడం, సమస్య పరిష్కారానికి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేయడం వంటివి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో సమస్యలు పరిష్కారం కాకపోతే రెండు పార్టీల మధ్య వైరం మరింత పెరిగి శత్రుత్వానికి దారితీస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఈ శతృత్వం మనిషిని చంపుకునేంత దాకా వెళుతుందంటే భూవివాదాల తీవ్రత ఎంతగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. చాల మంది బాధితులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యపై తహసీల్దార్ ను సంప్రదిస్తే క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించేందుకే రోజులు, నెలల తరబడి జాప్యం చేస్‌తున్నట్లు బాధితులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమయం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. ఈలోపు ఇద్దరి మధ్య గెట్టు దగ్గర పంచాయతీ ముదిరి భౌతిక దాడులకు దిగే వరకు వెళుతున్నాయి. సింపుల్ గా హద్దులు చూపించి మండల సర్వేయర్ల స్థాయిలోనే పరిష్కరించే అవకాశమున్న సమస్యను కూడా అధికారులు జఠిలం చేసి సమస్య పెద్దదవడానికి పరోక్షంగా కారకులవుతున్నారు.
భూసర్వే కోసం టిప్పన్ చలానా కట్టిస్తున్నా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు చెందిన ఇన్ స్పెక్టర్ లు క్షేత్రస్థాయిలో కొలతలకు రావాలంటే డేట్ ఇవ్వడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. నాయకులతోనో, ఫైరవీకారులతోనో వెళ్లి ముడుపులు ముట్టజెపితే తప్ప కొలతలకు రావడం లేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ క్షేత్రస్థాయికి కొలతలకు వచ్చినా సవాలక్ష కారణాలతో కొలతలు పూర్తి చేయకుండానే మరోసారి రావాల్సి ఉంటుందని ఏవేవో కారణాలు చెప్పి తిరిగి వెళ్లి పోతున్నారని బాధితులు అంటున్నారు. టిప్పన్ కట్టిన ప్రతిసారి ఇలాగే వస్తూ పోతున్నారే తప్ప సమస్యలు పరిష్కరించి రైతుల మధ్య భూవివాదాలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయడం లేదని రైతులారోపిస్తున్నారు.
పెండింగులో వందల దరఖాస్తులు ..
డిచ్ పల్లి, ధర్పల్లి, భీమ్‍గల్, సిరికొండ, కమ్మర్ పల్లి, మోపాల్, ఆర్మూర్, నందిపేట్, బాల్కొండ తదితర మండలాల్లో ఈ భూవివాదాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల వద్ద వందల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిపై స్పందించాల్సిన అధికారులు స్పందించాల్సినంత వేగంగా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. భీమ్‍గల్ మండలం కుప్కల్ గ్రామంలోని అసైన్మెంట్ భూముల్లో పట్టాదారుల మధ్య భూవివాదాలు చాలా ఉన్నాయి. కుప్కల్ శివారులోని వివిధ సర్వేనెంబర్లలోని అసైన్మెంట్ భూముల్లో జిల్లాలో ఎక్కడా లేని విధంగా భూ వివాదాలున్నాయి. వందలాది ఎకరాల విస్తీర్ణంలో సర్వేనెంబర్లుండటం, ఆయా సర్వే నెంబర్లలో అధికారులు ఇష్టారీతిన ఎవరికి పడితే వారికి కాస్తులో లేని వారికి కూడా పట్టాలు చేసివ్వడంతో ఇష్టారీతిన కబ్జాలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇప్పుడు రైతుల మధ్య తీవ్ర వివాదాలకు కారణమైంది. ఎన్నో యేళ్లుగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులు వివాదాస్పద భూముల్లో సర్వేలు జరుపుతున్నా కనీసం 20 శాతం భూముల్లో కూడా సమస్యలు పరిష్కారం కాలేదని రైతులంటున్నారు. వచ్చిన ప్రతిసారి సర్వే అధికారులకు ముడుపులు ముట్టచెప్పడం ఉందే తప్ప పనులు జరగడం లేదని చెబుతున్నారు.
కుప్కల్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 59 లో కేవలం 21.23 ఎకరాల విస్తీర్ణంలోని భూవివాదాన్ని కూడా అధికారులు ఏళ్లుగా పరిష్కరించడం లేదు. ఇప్పటికే రైతులు లెక్కలేనన్ని సార్లు టిప్పన్ కట్టారు. అధికారులు రైతులకు నోటీసులిచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వేకు వచ్చారు. మొక్కుబడిగా సర్వే జరిపారు. ఏవో కుంటిసాకులు చెప్పి తరువాత మరో సారి వస్తామని వెళతారే తప్ప మళ్లీ టిప్పన్ కడితే తప్ప రావడం లేదు. వచ్చినా సమస్య పరిష్కరించడం లేదని రైతులు వాపోతున్నారు. కేవలం 21.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సర్వేనెంబర్ 59 ను కొలతలు చేసి సమస్యను పరిష్కరించని అధికారులు, ఇదే గ్రామంలో దాదాపు 600 లకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న సర్వేనెంబర్ లోని వివాదాలను ఎలా పరిష్కరిస్తారనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయంపై సర్వే అధికారులను సంప్రదిస్తే.. తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటి కప్పుడు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నామని, సర్వేయర్ల కొరత కారణంగా కొన్ని చోట్ల సర్వే ఆలస్యం అవుతుందంటున్నారు. ఎక్కడా తమ నిర్లక్ష్యం లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేకు ఆటంకం కలిగే చోట ఇబ్బందులేర్పడుంటాయని, అక్కడ మరో సారి డేట్ ఇచ్చి సర్వే చేస్తున్నామంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా అనధికారిక లెక్కల ప్రకారం..
భూవివాదాల కారణంగా గత ఐదేళ్లలో జిల్లాలో దాదాపు 30 మంది వరకు చనిపోయారు. కొంత మంది హత్య గావించబడితే, మరి కొంత మంది భూ సమస్యలు పరిష్కారం కాక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. వందల్లో ఎఫ్ ఐ ఆర్ లు నమోదైన కేసులున్నాయి. జైలుకు వెళ్లి వచ్చిన వారు వందపైనే ఉన్నారు. భూ వివాదాల కారణంగా తీవ్రంగా కొట్టుకుని ఆస్పత్రి పాలైన వారు కూడా లెక్కలేనంత మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి భూవివాద బాధితుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరిని కదిపినా ఇవే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే రాబోయే రోజుల్లో భూవివాదాల కారణంగానే క్షేత్రస్థాయిలో ఎక్కువగా హత్యలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి. జాగ్రత్త పడితే తప్ప అనర్థాలను ఆపలేని పరిస్థితులున్నాయి.