సమస్యల వలయంలో ఏర్గట్ల కేజీబీవీ

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యను అభ్యసించేందుకు పేద మధ్యతరగతి పిల్లలు, నిరు పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేజీబీవీలను ఏర్పాటు చేశారు.

Update: 2024-08-21 05:05 GMT

దిశ, ఏర్గట్ల : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యను అభ్యసించేందుకు పేద మధ్యతరగతి పిల్లలు, నిరు పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేజీబీవీలను ఏర్పాటు చేశారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కస్తూర్బాగాంధీ విద్యాలయాలను కొనసాగించడం తప్ప సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఏర్గట్ల మండల కేంద్రంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో కస్తూర్బా గాంధీ పాఠశాల మంజూరు చేశారు. ఊరి చివరలో నూతన పాఠశాల భవనం నిర్మించి, ఇదే సంవత్సరం ప్రారంబోత్సవం కూడా చేశారు. పాఠశాల వరకు అంతా బాగానే ఉంది కానీ, పాఠశాల చుట్టూ ప్రహరి లేకపోవడంతో విష పురుగులు, పాములు సంచారం ఎక్కువయ్యింది. విద్యార్టినిలకు విష పురుగులు, పాములు నుండి రక్షణ కరువవడంతో విద్యార్థినులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

నడవడానికి కూడా వీలు లేని రహదారి

దీనికి తోడు కస్తూర్బా పాఠశాలకు వెళ్లాలంటే ప్రధాన రహదారి నుండి పాఠశాల వరకు రోడ్డు సరీగా లేక నడవడానికి కూడా వీలు లేకుండా అధ్వానంగా ఉంది. పాఠశాల, పరిసరాలు లోతట్టు ప్రాంతంలో ఉండడంతో భారీ వర్షం కారణంగా ఎగువ నుంచి పారుతున్న వర్షం నీటితో రహదారి కోతకు గురై నీరంతా పాఠశాల ప్రాంగణంలో చేరి చెరువును తలపిస్తుంది. వర్షం కారణంగా నీరు నిలిచి సిబ్బందికి విధులకు అసౌకర్యంగా మారింది. విధుల నిర్వహణలో భాగంగా పాఠశాలకు వెళ్లేందుకు పాఠశాల సిబ్బందికి, విద్యార్థినిల తల్లిదండ్రులకు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలను చూడడానికి వచ్చే తల్లిదండ్రులు, విధి నిర్వహణకు వచ్చే పాఠశాల సిబ్బందికి ప్రధాన రహదారి నుండి కాలినడకే శరణ్యం కావడంతో దారి అనుకూలంగా లేక పలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

చెరువును తలపిస్తున్న పాఠశాల ప్రాంగణం

వర్షాల కారణంగా పాఠశాల ప్రాంగణంలో వృథాగా నీరంతా చేరి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం వల్ల మురికి నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లే విధంగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నూతన భవనంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు, ప్రహరీ ఏర్పాటు, ప్రధాన రహదారి నుండి పాఠశాల వరకు సిసి రోడ్డు, లాంటి అవసరాలు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

అధిక లోడుతో విద్యుత్ అంతరాయం

అలాగే పాఠశాలకు సరఫరా అయ్యే విద్యుత్ అధిక లోడుతో నిత్యం సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం పాఠశాల చుట్టూ నిలువ ఉన్న వర్షపు నీటితో దోమలకు నిలయంగా మారింది. రాత్రివేళలో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో దోమలు సైరా విహారంతో విద్యార్థులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. అలాగే పాఠశాల ఆవరణంలో పరిసరాల నుంచి వచ్చే కోతులు నానా హంగామా చేస్తాయి. కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు విద్యార్థులపై కోతులు దాడి చేస్తాయో అనే ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత శాఖల ఉన్నత అధికారులు స్పందించి కేజీబీవీ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.


Similar News