నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‏కు గడ్డుకాలం

నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పార్లమెంటు ఎన్నికల తరువాత కీలక నేతలు అధికార కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలు రావడంతో ఆ పార్టీ బలోపేతానికి నజర్ వేసింది.

Update: 2024-06-18 02:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పార్లమెంటు ఎన్నికల తరువాత కీలక నేతలు అధికార కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలు రావడంతో ఆ పార్టీ బలోపేతానికి నజర్ వేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాలు గెలవడంతో ఇప్పటికే జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ ఆగస్టుకు వాయిదా వేసినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనిపించకుండా పోగా దాని ఓట్లను బీజేపీ, కాంగ్రెస్ షేర్ చేసుకున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలవడం, నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ముక్కోణపు పోటీల్లో ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారడంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులపై ప్రధానంగా ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీలో చర్చ మొదలైంది.

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్, మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, రెండు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిన విషయం తెల్సిందే. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తక్కువ మెజార్టీతో గెలువగా , మాజీ స్పీకర్ పోచారం మాత్రం బాన్సువాడలో 20 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఇద్దరు నేతలు కూడా మాజీ సీఎం కేసీఆర్ కు ఆత్మీయులుగా పేరుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తక్కువ ఓటు బ్యాంక్ నమోదు చేసుకున్న బీఆర్ఎస్ ను కనుమరుగు చేయాలన్న సంకల్పంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నజర్ వేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఇదే విషయం రెండు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి లాగి మినిస్టర్ పదవి ఇస్తారన్న చర్చ జోరుగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఖండించకపోవడం విశేషం.

ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వస్తే గానీ ఈ ప్రచారానికి తెర పడేలా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలుత మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, రెండో సారి రాష్ట్ర మంత్రిగా పని చేసిన ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. కాళేశ్వరం తర్వాత మిషన్ భగీరథ పనులపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి లాగేందుకు ఇదే అదునుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గత కొంత కాలంగా పోచారం తన తనయుడికి రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ అధినేతకు విన్నవించుకున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. 8వ సారి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోచారం తనయుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న హామీపై పార్టీలో చేర్చుకునే ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా పోచారం పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. అనాడు ఖండించి బరిలో నిలిచి గెలిచిన పోచారం ప్రస్తుతం వస్తున్న గాసిప్స్ పై మాత్రం స్పందించడం లేదు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఖండించడం జరగకపోవడంతో ఏవి ఊహగానాలో ఏది ప్రచారమో తెలియక బీఆర్ఎస్ శ్రేణులు సతమతమవుతున్నాయి.


Similar News