అర్హత లేకున్నా ఇంచార్జ్ పదవులు.. ఇందూరు బల్దియాలో తంతు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అనర్హులు, కనీస అర్హతలేని ఇన్చార్జిల పాలనలతో కొట్టుమిట్టాడుతుంది.

Update: 2024-05-30 04:41 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అనర్హులు, కనీస అర్హతలేని ఇన్చార్జిల పాలనలతో కొట్టుమిట్టాడుతుంది. దీంతో నగరం‌లో పారిశుధ్యం పడకేసిన పరిస్థితి నెలకొంది. అక్కడ పనిచేసే జవాన్ నుంచి ఎంచ్‌వో వరకు వారు ఉద్యోగం చేసేందుకు ఏ మాత్రం అర్హత లేకున్నా పూర్తి స్థాయి ఉద్యోగులు కాకున్నప్పటికీ ఇంచార్జీలుగా చలామణి అవుతూ అధికార దర్పం అనుభవిస్తూ వస్తున్నారు. ఎంహెచ్‌వోగా డాక్టర్ సిరాజుద్దిన్ రిటైర్ అవ్వడంతో అప్పటి నుంచి నేటి వరకు కొత్త పూర్తి స్థాయి ఎం‌ఎచ్‌వో నియమించలేదు. దీంతో ఆ స్థానంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించే సాజిద్ అలీని ఇంచార్జీ ఎం‌ఎచ్‌వోగా అప్పటి అధికారులు ప్రభుత్వం ఎలాంటి అర్హత లేనప్పటికి ఆయన కు బాధ్యతలు అప్పగించారు.

వాస్తవానికి ఎమ్‌హెచ్‌‌వోగా ఉండాలంటే ప్రభుత్వ డాక్టర్‌గా పని చేసిన వారు ఎంహె‌వోగా కొనసాగాలి. కానీ, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎలాంటి అర్హత లేకుండా ఎం‌ఎచ్‌‌వోగా విధులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. ముఖ్యంగా సదరు అధికారి సాజిద్ అలీ ప్రతిరోజూ మటన్ మార్కెట్‌కు వెళ్లి అక్కడ తనిఖీలు నిర్వహించి శుభ్రమైన మాంసాన్ని అందించేలా తనిఖీలు చేపట్టి స్టాంప్ వేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఆ పని జరగడం లేదు. నగరంలోని శివారు ప్రాంతాలలో పారిశుధ్యం పూర్తిగా లోపిస్తుంది. దీంతో ప్రజలు అనేకమైన వ్యాధులతో నిత్యం ఆసుపత్రుల బారిన పడుతున్నారు. అయినప్పటికీ ఆ అధికారి మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండకుండా తన సొంత పనులపై దృష్టి పెడుతున్నాడు.

ఆయన సంగతి ఇలా ఉంటే.. నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేషన్‌లో పనిచేసే జవాన్లు కూడా కనీస అర్హత లేకుండా, ఎంపీహెచ్ఏ పూర్తి చేసుకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేషన్‌కు కమిషనర్‌గా ఉన్న అధికారి ఐఏఎస్ కేడర్‌కు చెందిన వారు ఉండగా కింది స్థాయిలో అధికారులు మాత్రం అర్హత లేకపోయిన ఉన్నత పదవులను అనుభవిస్తూ అధికారాన్ని చేలాయిస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో ప్రతిరోజూ 150 టన్నుల చెత్త వస్తుంది. అందుకు గాను చెత్త ఏరేందుకు నిత్యం 500 మంది పారిశుధ్య కార్మికులు ఇందులో పాల్గొంటారు. 500 మందిలో దాదాపు 100 మంది రెగ్యులర్‌గా 400 మంది ఔట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిశాక అయినా ప్రభుత్వం ఓ అర్హత కలిగిన వ్యక్తిని ఎంహెచ్‌వోగా నియమించాలని ప్రజలకు కోరుతున్నారు.


Similar News