బీఆర్ఎస్ పాలనలో పేదలు బతకడం కష్టం..మాజీ మంత్రి

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పేదలు బతకడం కష్టంగా మారిందని, వారు బాగుండాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ ఆకాంక్షించారు.

Update: 2023-06-01 16:24 GMT

దిశ, భిక్కనూరు : ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పేదలు బతకడం కష్టంగా మారిందని, వారు బాగుండాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ ఆకాంక్షించారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలో ఆటో యూనియన్ కు చెందిన సభ్యులు 50 మంది పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు తమకుటుంబ ప్రయోజనాలు తప్ప పేదల బాగోగులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల అభివృద్ధి పై ఉన్న దృష్టి, ఇతర నియోజకవర్గాల పై లేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యారంగం, పరిశోధన సంస్థలు, విశాలమైన రోడ్లు, ట్యాంక్ బండ్లు, రెండు పడక గదుల ఇండ్లు, అర్హులందరికీ పెన్షన్లు వంటివన్నీ వారివారి నియోజకవర్గాలకే పరిమితం చేశాడని ఆరోపించారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో వాటికి నిధుల కొరత లేదని, ఆయన సొంత గ్రామమైన చింతమడకలో ఇంటింటికి పదిలక్షలు ఇచ్చాడని ధ్వజమెత్తారు.

పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిన నేతలంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఎంపీటీసీలకు సర్పంచులకు ఎంతో గౌరవం ఉండేదని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారు ఫైరవీకారులుగా ముద్ర పడిపోయారన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చిచ్చుపెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, జిల్లా కార్యదర్శి తాటిపాముల లింబాద్రి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి మాజీ అధ్యక్షులు తాటిపాముల సిద్దా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News