దిశ ఎఫెక్ట్....మత్తు వదలని ఎక్సైజ్ శాఖ కథనానికి స్పందన

నిజామాబాద్ జిల్లాలో కల్లు తయారీలో వినియోగించే నిషేధ ఆల్పోజలం దందాలో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే భాగస్వాములుగా ఉన్నారని, వారే ఈ దందాలు నడుపుతున్నారని దిశలో వచ్చిన కథనం అధికారుల్లో చలనం తెప్పించింది.

Update: 2024-06-01 13:00 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కల్లు తయారీలో వినియోగించే నిషేధ ఆల్పోజలం దందాలో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే భాగస్వాములుగా ఉన్నారని, వారే ఈ దందాలు నడుపుతున్నారని దిశలో వచ్చిన కథనం అధికారుల్లో చలనం తెప్పించింది. శనివారం దిశ దినపత్రికలో మత్తు వదలని ఎక్సైజ్ శాఖ పేరుతో వచ్చిన కథనం పై నిజామాబాద్ అధికారులు స్పందించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన హెడ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న మత్తుపదార్థాల రవాణా దందాపై ఆరా తీశారు.

     నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న కల్లు డిపో నిర్వాహకులు ఎవరని వివరాలను సేకరించారు. కల్లు డిపో ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందని, దాని వెనుక ఉన్న భాగస్వాములు ఎవరని అధికారులు ఆరా తీశారు. రెంజల్ కల్లు డిపోను ఎక్సైజ్ అధికారులు గతంలో సీజ్ చేసినా ఎలా నడుస్తుందని, దాని వెనుక ఉన్న వారు ఎవరని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి సంబంధిత కల్లు డిపోలతో పాటు పలు కల్లు దుకాణాలలో తనిఖీ నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల దందాలో ఉన్న వారి వివరాలను అధికారులు సేకరించారు. సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు.


Similar News