బహిరంగ చర్చకు ఎవరొస్తారో రండి..

గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు మానుకోవాలని, లేదంటే మీ ఆరోపణల పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల పై మేం చర్చకు వస్తామని డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.

Update: 2024-11-30 11:10 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు మానుకోవాలని, లేదంటే మీ ఆరోపణల పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల పై మేం చర్చకు వస్తామని డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వారు మాట్లాడే అబద్ధాలను ప్రజలు నిజమని నమ్ముతారనే భ్రమలో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మానాల మోహన్ రెడ్డి అన్నారు. అబద్దాలు మాట్లాడినంత మాత్రాన అవే నిజాలు కావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ఉందని మోహన్ రెడ్డి తెలిపారు.

గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ వేయదని చెప్పిన బీఆర్ఎస్ నాయకుల తప్పుడు మాటలు నమ్మి రైతులు భయంతో వారి పంటను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేలా చేశారన్నారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ముఖం చాటేసారని, మానాల మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలను వెనక్కి నెట్టివేసిందని, రాష్ట్రం విచ్ఛిన్నమయ్యే విధంగా చేసిందని ఆయనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి విచ్ఛిన్నమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. త్వరలోనే మిగిలిన అన్ని హామీలు కూడా నెరవేరతాయని మానాల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్లలో వారు చేసిన అభివృద్ధి పై గడిచిన 10 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధి పైన చర్చకు రావాలని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాల అమలు పై అక్రమాల పై, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన పథకాల పై మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని మోహన్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి రాష్ట్రస్థాయిలో ఉన్న బిల్లా, రంగాలు అయిన కేటీఆర్ హరీష్ రావు వస్తారో లేక జిల్లాలో తోడు దొంగలుగా ఉన్న ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డిలు వస్తారో నిర్ణయించుకోవాలని మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ నుండి మా ఎమ్మెల్యేలు, మేం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా సిద్ధంగా ఉండాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మానాల మోహన్ రెడ్డి జీవన్ రెడ్డిని హెచ్చరించారు. మహేష్ కుమార్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో సెటిల్మెంట్లు చేస్తూ, అంతులేని అవినీతికి పాల్పడుతూ అరాచకం చేస్తున్నది జీవన్ రెడ్డి అని, విదేశాలకు పంపుతామని బ్రోకర్ పనులు చేసి అమాయకులను మోసం చేసింది కేసీఆర్ అని మానాల మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. మరొక్కసారి కాంగ్రెస్ నాయకుల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

బీఆర్ఎస్ నాయకులకు సిగ్గూ, శరమూ, దమ్మూ , ధైర్యముంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పైన, అభివృద్ధి పైన చర్చకు రావాలని మోహన్ రెడ్డి సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజా రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు వేణు రాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్ మన్ చైర్మన్ శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ చిన్న రాజేష్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్, ఆకుల మహేందర్, సాయి కిరణ్, హరీష్, చింటూ మరియు తదితరులు పాల్గొన్నారు.


Similar News