డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి పిప్రి రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు, బాల్కొండ సెగ్మెంట్ కు సంబంధించి భీంగల్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేపడుతున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎం.సుబ్రాచక్రవర్తితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీఓ, ఏపీఓ, ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎంల పనితీరును ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది సరిచేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తేవాలని ఆర్ఓలకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
కాగా, బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని బడా భీంగల్, చెంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి, వీల్ చైర్స్ ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అమర్చిన సీసీ కెమెరాలను, మోడల్ పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కలెక్టర్ గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.