హరితహారం పై గొడ్డలి వేటు "

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అధికారుల నిర్లక్ష్యంతో అబాసుపాలు అవుతుంది.

Update: 2024-06-01 03:32 GMT

దిశ, ఏర్గట్ల: ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అధికారుల నిర్లక్ష్యంతో అబాసుపాలు అవుతుంది. రెండు శాఖల అధికారుల సమన్వయ లోపం కారణంగా ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఆఘమేఘాల మీద అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటడంతో అవి పెరిగాక ఇష్టారాజ్యంగా చెట్లను నరుకుతున్నారు. దీంతో హరితహారం కార్యక్రమం నాటడం, నరకడం అన్నట్లుగా మారింది. గత రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మొక్కలు నాటుతున్న సరైన ప్రణాళిక లేక లక్ష్యం చేరాలనే తాపత్రయం తో ఖాళీ స్థలం కనపడితే చాలు గుంతలు తీసి మొక్కలు నాటడం అన్నట్లుగా వ్యవహరించారు. ప్రధాన రహదారులు, గ్రామాల అంతర్గత రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం మూడునాళ్ళ ముచ్చటగా మారింది.

వివరాల్లోకి వెళితే ఏర్గట్ల మండల కేంద్రం నుంచి తాళ్ల రాంపూర్, రాజ రాజేశ్వర నగర్ (నల్లూర్) అలాగే బట్టాపూర్ వెళ్లే రహదారిలో గతంలో మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దగా అవడం తో పదుల సంఖ్యలో చెట్ల కొమ్మలతో పాటు, పదుల సంఖ్యలో మొత్తం చెట్లను కొట్టి వేయడం గమనార్హం. హరితహారాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటి ? కొందరు రైతులు తమ పంట పొలాల్లో ఉన్న చెట్లను ప్రాణంగా రక్షిస్తుంటే, మరి కొందరు రైతులు చెట్ల వల్ల పంటకు నీడనిస్తుందని, పంట దిగుబడి తగ్గుతుందని కొమ్మలు తొలగిస్తున్నారు. ఇంకొన్ని స్థలాల్లో రైతులు ట్రాక్టర్ నాగళ్ళతో చెట్లను పడగొట్టడం, చెట్ల బెరడ్లు తీసి ఎండిపోయేలా చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు చెట్టు మొదల్లో మంట పెట్టడంతో ఎండిపోయి చనిపోతున్నాయి. అట్టి రైతులకు జరిమానాలు విధించే అధికారులు విద్యుత్ వైర్ల కింద ఉన్న మొక్కలను మొదటికే నరికి వేస్తే కనిపించక పోవడం, వారికి ఎలాంటి జరిమానా విధించక పోవడం విడ్డూరంగా ఉంది.

హరితహారం నిబంధనల మేరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు కార్యాలయాలు, ఎలాంటి అడ్డంకులు లేని చోట మాత్రమే మొక్కలు నాటాల్సి ఉంటుంది. అయితే గతంలో అధికార యంత్రాంగం మాత్రం అందుకు విరుద్ధంగా కార్యక్రమం చేపట్టింది. దీంతో నాటిన మొక్కలు 1, 2 సంవత్సరాలకే గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. ఫలితంగా ప్రతి సంవత్సరం ఎంతో అట్టహాసంగా చేపడుతున్న హరితహారం పర్యవేక్షణ లోపం తో మధ్యలోనే నీరుగారిపోతుందని విమర్శలు వినబడుతున్నాయి. రైతులు తమ పంట పొలాలను కోతుల బెడద నుంచి, చెట్ల నీడ వల్ల పంట దిగుబడి తగ్గుతుందని చెట్లను నరికితే జరిమానాలు విధించే అధికారులు చెట్లను నరికి వేసి ప్రభుత్వ ధనం, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే వాదనలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నత అధికారులు దీనిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News