నా నెత్తిమీద అమ్మవారు ఉంది... కేసీఆర్ సహకారం తోడుంది...
నా నెత్తి మీద అమ్మవారుందేమో.. కేసీఆర్ సహకారం ఎలాగూ ఉంది.. అందుకే బాల్కొండ నియోజకవర్గంలో ప్రజల కోసం తలపెట్టిన పనులన్నీ దాదాపుగా వందశాతం చేయించగలిగానని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
దిశ, ఆర్మూర్ : నా నెత్తి మీద అమ్మవారుందేమో.. కేసీఆర్ సహకారం ఎలాగూ ఉంది.. అందుకే బాల్కొండ నియోజకవర్గంలో ప్రజల కోసం తలపెట్టిన పనులన్నీ దాదాపుగా వందశాతం చేయించగలిగానని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం అక్లూర్, జాన్కంపేట్, సాహెబ్‌పేట్ గ్రామాల్లో ఆయన శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, కులవృత్తుల వారు, యువకులు ఘన స్వాగతం పలికారు. వలగొడుగులు, డప్పుల దరువులతో దారి పొడవునా స్వాగతం పలికారు. అక్లూర్‌లో మంత్రి ఎన్నికల ప్రచారం కోసం బంజరి పటేల్ పద్మ అనే మహిళ ఐదు వేల రూపాయల ఎన్నికల ఖర్చు కోసం విరాళాన్ని అందించారు. బాల్కొండ నియోజకవర్గంలో చిన్న చిన్న గ్రామాలకు సైతం డబుల్ రోడ్డు సౌకర్యం కల్పించానన్నారు. ఫలితంగా ప్రజలకు రోడ్డు సౌకర్యం మెరుగవ్వడమే కాకుండా రైతుల భూముల
విలువ కూడా డబుల్ అవుతుందని, ఇది తనకెంతో ఆనందంగా ఉందన్నారు. జాన్కంపేట్, సాహెబ్‌పేట్ డబుల్ రోడ్డు ఇందుకు నిదర్శనమన్నారు. అక్లూరు, జాన్కంపేట్, సాహెబ్‌పేట్ గ్రామాలకు అడిగినవన్నీ, అడగనవి కూడా చేసి పెట్టానని గుర్తు చేశారు. చెక్ డ్యాం నిర్మాణంతో భూములకు, బోరు బావులకు శాశ్వతంగా ప్రాణం పోశా నన్నారు. జాన్కంపేట్‌లో మరో చెక్‌డ్యాంను సైతం మంజూరు చేయించానన్నారు. దాని నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. నిజాంసాగర్ నీటిని అందించడం కోసం జాన్కంపేట్‌లో పైప్‌లైన్ నిర్మాణం కోసం భగీరథ ప్రయత్నమే చేశానని తెలిపారు. ఫలితంగా పైప్‌లైన్ ద్వారా చెరువులోకి కావాల్సినన్ని నీళ్లు అందుతున్నాయన్నారు. జాన్కంపేట్‌లో చెక్ డ్యాం, పైప్‌లైన్ పనులు జరుగక ముందు.. కేసీఆర్ 24 గంటల కరెంటు, రైతుబంధు అందించక ముందు, ఒక్క పంట మాత్రమే పండిన రోజులు చూశామని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పుట్టిన గడ్డ జాన్కంపేట గ్రామమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కర్ణాటకలో నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉన్న పింఛన్లను పీకేస్తుందన్నారు. పది గంటల కరెంటు హామీ ఇచ్చి ఐదు గంటలు కూడా ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం
రైతులకు తెలంగాణ లాంటి ఒక్క సాయమైనా చేయడం లేదన్నారు. అక్కడ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే రెండు లక్షల రూపాయలు కట్టాల్సిందేనన్నారు. ప్రతీ ఏడాది పదివేల రూపాయల బిల్లు చెల్లించాల్సిందేనన్నారు. తెలంగాణలో గ్రామ గ్రామాన కాంటాలు పెట్టి పంట ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకే డబ్బులు కేసీఆర్ ప్రభుత్వం వేస్తున్న విషయం తెలిసిందేనన్నారు. అదే మహారాష్ట్రలో అయితే నియోజకవర్గానికి ఒకటి, రెండుకు మించి కాంటాలు ఉండవని, పదిశాతం ధాన్యాన్ని కూడా అక్కడి బీజేపీ ప్రభుత్వం కొనదని చెప్పారు. అందుకే అటు కాంగ్రెస్ వాళ్లు కర్ణాటకకు, ఇటు బీజేపీ వాళ్లు మహారాష్ట్రకు వెళ్లి చూసి రావాలని... తాను చెప్పింది నిజమైతే టీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రధాని మోడీ ధరలు పెంచుతూ సామాన్యుడి జేబుదొంగగా మారారన్నారు.
ఆసరా పింఛన్, రైతుబంధు లాంటి డబ్బు సహయ పథకాలతో సామాన్యుడి ఇంటికి సంపద పంపుతుంటే .. మోడీ సర్కారు కేసీఆర్ ఇచ్చిన సంపదను ధరలు పెంచుతూ కొళ్లగొడుతున్నదని విమర్శించారు. రుణమాఫీ ప్రతీ రైతుకు అంది తీరుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ. 19,600 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా.. అందులో ఇది వరకే 13 వేల కోట్ల రుణమాఫీని కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. మిగిలిన 6 వేల కోట్ల రుణమాఫీ తప్పకుండా వందశాతం పూర్తవుతుందన్నారు. ఇక్కడ రుణమాఫీ అందడం ఆలస్య మైన రైతులకు కూడా త్వరలోనే అందుతుందని, ఇందుకు నా జిమ్మేదారేనని భరోసా ఇచ్చారు. ఈ గ్రామాలు తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ఆత్మీయ గ్రామాలని మంత్రి గుర్తు చేశారు. ఇక్కడి ప్రజల్లో ఆయన జ్ఞాపకాలు నిలిచిపోయాయన్నారు. ప్రచార సందర్బంగా మంత్రితో పాటు గ్రామస్తులు, కార్యకర్తలు, నాయకులు వేముల సురేందర్ రెడ్డిని స్మరించుకున్నారు.