పసుపు సాగుపై రైతుల ఆసక్తి.. 30 వేల ఎకరాలకు పైగానే సాగు చేసే అవకాశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పట్లో ఇందూరు జిల్లా అన్నపూర్ణగా విలసిల్లింది. గతంలో ఇందూరు జిల్లాలో పసుపు పచ్చ బంగారం పంట సాగు జిల్లాలోని ప్రతి రైతులు విరివిగా సాగు చేసేవారు.

Update: 2024-06-01 02:15 GMT

దిశ, ఆర్మూర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పట్లో ఇందూరు జిల్లా అన్నపూర్ణగా విలసిల్లింది. గతంలో ఇందూరు జిల్లాలో పసుపు పచ్చ బంగారం పంట సాగు జిల్లాలోని ప్రతి రైతులు విరివిగా సాగు చేసేవారు. గతంలో పసుపు పంట పండిస్తూ రైతు పసుపు పంటను అమ్ముకొని వారి వారి ఇండ్లలోకి బంగారాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లే వారమని అప్పటి రైతులు చెబుతున్నారు. కాలక్రమేణా పసుపు పంటకు ఆశించిన ధర లేకపోవడంతో పాటు, రైతుకు పసుపు పంట సాగుకు ఖర్చుల భారం తడిసి మోపెడు కావడంతో నానాటికీ రైతులు పసుపు పంటను మారుస్తూ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతూ పసుపు సాగు తగ్గిస్తూ వచ్చారు. కానీ ఈ సంవత్సరం పసుపు పంట క్వింటాకు రూ. 20 వేల మార్కు ధర పలకడంతో పసుపు రైతుల్లో ఎక్కడలేని సంతోషం వెల్లివిరిసింది. ఇంతకుముందు ఖర్చుల భారం తో పసుపు పంటను సాగు చేయడం మానేసిన రైతులు సైతం ఈ ఖరీఫ్ ప్రారంభం నుంచి పసుపు పంటలు సాగు చేసేందుకు రైతులు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్ కు ముందు పసుపు పంట సాగు చేసేందుకు రైతులు వారి వారి పంట పొలాల్లో భూముల దుక్కులను సిద్ధం చేస్తూ ఎరువులను తరలించుకుని సిద్ధం చేసుకుంటున్నారు.

గత ఏడాది 19 వేల ఎకరాల్లో పసుపు సాగు..

నిజామాబాద్ జిల్లాలో గత సంవత్సరం 2023-24 లో 19 వేల ఎకరాల్లోనే జిల్లాలోని రైతులు పచ్చ బంగారమైన పసుపు పంట సాగు చేశారు. పసుపు పంటకు ఆశించిన ధర లేకపోవడంతో పాటు, పంట సాగు ఖర్చులు పెరగడం తో రైతులు పంట మార్పిడి చేసి వేరే పంటల వైపు వెళ్లారు. సుమారుగా ఓ రెండేళ్ల కిందట పసుపు సాగు వివరాలను జిల్లాలో పరిశీలిస్తే 2021-22 లోనే 34 వేల ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేశారు. జిల్లాలో పదేళ్ల క్రితం పసుపు సుమారు 50 వేల ఎకరాల్లో పైగానే రైతులు సాగు చేసే వారు. ధర లేకపోవడంతో పాటు ఖర్చులు పెరగడం తో పసుపు పంటను తగ్గిస్తూ ఇతర పంటల వైపు రైతులు మళ్లీ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ప్రారంభించారు.

కానీ కిందటి ఏడాది రూ.20వేల మార్క్ ధరను పసుపు పంట క్వింటాకు దాటడంతో ఈ ఏడాది మళ్లీ పసుపు పంటను సాగు చేసేందుకు జిల్లాలోని రైతులందరూ అత్యంత ఉత్సాహాన్ని చూపెడుతున్నారు. ఈ ఏడాది కచ్చితంగా 30 వేల ఎకరాల పైగానే పసుపు పంట సాగు చేసే అవకాశం దండిగా కనబడుతుంది. ఆ తీరుగానే జిల్లాలోని రైతులందరూ వారి వారి పంట పొలాల్లో భూములను పసుపు పంట సాగు చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం సైతం రైతుల్లో పసుపు పంట సాగు చేసేందుకు నూతన ఆలోచనలు రేకెత్తిస్తుంది.


Similar News