ఈడీ నెక్ట్స్ టార్గెట్ అధికార పార్టీ ఎమ్మెల్సీ.. ముందే ఊహించాడా?

రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులు అధికార పార్టీ నేతలను ఇప్పటికే హడలు పుట్టిస్తుండగా.. అదేసమయంలో తర్వాతి గురి ఎవరిపై అన్న అంశం వారిని నిద్రపట్టనీయడంలేదు.

Update: 2022-11-24 03:16 GMT

రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులు అధికార పార్టీ నేతలను ఇప్పటికే హడలు పుట్టిస్తుండగా.. అదేసమయంలో తర్వాతి గురి ఎవరిపై అన్న అంశం వారిని నిద్రపట్టనీయడంలేదు. అయితే, సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్సీనే కేంద్రం టార్గెట్​చేస్తుందని పొలిటికల్ సర్కిళ్లలో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిని బలపరుస్తూ ఓ ఎమ్మెల్సీ కూడా తననే టార్గెట్​చేస్తారని సన్నిహితుల వద్ద చెప్పుకోవడం గమనార్హం. పైగా దీనిని ముందే ఊహించానని.. దాడులకు బెదిరేది లేదంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. బడా వ్యాపారాలు ఉన్న రాజకీయవేత్తలకు మాత్రం టెన్షన్​ పట్టుకున్నది. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా.. ఈడీ, ఐటీ చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఇక రాజధాని నేతలే కాకుండా జిల్లాల్లోని నేతలు దాడుల నేపథ్యంలో అన్నీ సర్దేసుకుంటున్నారు. విలువైన డాక్యుమెంట్లు బంధువుల వద్ద కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆదాయ వనరులపై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేయడం అధికార టీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులు, డైరెక్టర్లు తదితరులందరి ఇళ్లపై సోదాలు జరుగుతుండడం ఆ నేతలకు ఆందోళనకు గురిచేస్తున్నది. ఇప్పటికే గంగుల కమలాకర్ నివాసంలో గ్రానైట్స్ వ్యవహారానికి సంబంధించి ఈడీ సోదాలు జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోదరులు, వ్యక్తిగత సహాయకుడిని ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డిపై ఐటీ విరుచుకుపడడంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నది.

టార్గెట్​ నేనే..

ఈసారి ఓ ఎమ్మెల్సీ టార్గెట్ కావచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి జరుగుతాయని ముందే ఊహించానంటూ ఓ ఎమ్మెల్సీ ఆఫ్ ది రికార్డుగా చెప్పుకొచ్చారు. ఇలాంటి దాడులకు తాను భయపడది లేదని, దర్యాప్తు సంస్థలతో బీజేపీ భయభ్రాంతులు సృష్టిస్తుందని మానసికంగా ఎప్పుడో సిద్ధమయ్యానంటూ వ్యాఖ్యానించారు. సోదాల్లో ఏమీ దొరకకపోయినా వారు వేధిస్తారని, అన్నింటికీ మెంటల్‌గా ప్రిపేర్ అయి ఉన్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ చేతిలో ఉన్న అస్త్రాలు దర్యాప్తు సంస్థలేనని, భయపెట్టడం ద్వారా లొంగదీసుకునే ఎత్తుగడల్లో భాగమే ఈ సోదాలు, టెన్షన్‌కు గురిచేయడమని పేర్కొనడం గమనార్హం.

యాక్షన్‌కు రియాక్షన్​

కేసీఆర్‌ను ఇరుకున పెట్టడానికే బీజేపీ ఈ దాడులు చేయిస్తున్నదంటూ టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. యాక్షన్‌కు రియాక్షన్ తప్పదంటూ బీజేపీని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపైనే ఐటీ, ఈడీ తొలుత ఫోకస్ పెడతాయని కొద్దిమంది గులాబీ నేతలు అంచనాకు వచ్చారు. మంత్రులతో మొదలైన దాడుల వ్యవహారం కేసీఆర్, కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల దాకా కొనసాగుతుందనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ను మానసికంగా టెన్షన్ పెట్టడం కోసం ఆయనకు క్లోజ్‌గా ఉండే ఎమ్మెల్సీయే ఐటీకి నెక్స్ట్ టార్గెట్ అవుతారనే ఊహాగానాలేకాక అంచనాలూ తెరపైకి వచ్చాయి.

వారికి టెన్షన్.. టెన్షన్​

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులతో బిజినెస్‌లోకి దిగిన టీఆర్ఎస్ పొలిటీషియన్లకు టెన్షన్ పట్టుకున్నది. హైదరాబాద్ నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం, విద్యా సంస్థల నిర్వహణ చేస్తున్నవారిపై ఐటీ దృష్టి పడొచ్చనే చర్చలు టీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్నాయి. ఆ తర్వాతి వరుసలో కాంట్రాక్టులు చేసే నేతలు టార్గెట్ అవుతారంటూ వారంతటవారుగానే అంచనాకు వచ్చేస్తున్నారు. మరోవైపు ఎక్కడా దొరకకుండా చూసుకోవాలన్న ముందు జాగ్రత్తలతో అన్నీ సర్దుకోవడంపై ఫోకస్ పెట్టారు. కుటుంబ సభ్యులే కాకుండా బంధువులు, సన్నిహితులు, ఉద్యోగులు.. ఇలా చిన్న లింకు దొరికినా అక్కడకు కూడా ఐటీ, ఈడీ టీమ్‌లు వెళ్తాయని, వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా తమ చేతిలో ఏమీ లేదని పలువురు టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకూ ఇలాంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఇలాంటి దాడులకు మానసికంగా సిద్ధం కావడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్ప పార్టీ అధినేత కాపాడాతారనే భరోసా ఏమీ లేదన్న నిరుత్సాహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

నేతలు.. ఆచితూచి

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇవి జరుగుతున్నందున రాష్ట్రస్థాయిలో సీఎంగా కేసీఆర్ చేయదగిందేమీ లేదని వారికి వారు సర్దిచెప్పుకుంటున్నారు. సీబీఐ లాంటి సంస్థలకు ఎంట్రీ లేకపోవడంతో ఇక ఐటీ, ఈడీ మాత్రమే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల నివాసం ఉండే గులాబీ నేతలే కాకుండా జిల్లాల్లోని సీనియర్లలోనూ ఈ గుబులు ఉన్నది. భూముల క్రయ విక్రయాల దగ్గరా దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. తాజా ఐటీ దాడుల్లో బినామీ అకౌంట్లు అంటూ ఐటీ అధికారులు కామెంట్ చేయడంతో దానికి తగినట్లుగా బిజినెస్ చేస్తున్న నేతలు పక్కా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జరగబోయేదానికి కాచుకుని కూర్చోవడం, సోదాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండిపోవడం మినహా వాటి నుంచి తప్పించుకునే మార్గం లేదన్న భావన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఎవరి తర్వాత ఎవరి వంతు అవుతుందనే లెక్కలే తప్ప కచ్చితంగా రెయిడ్‌లు జరుగుతాయనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.


Similar News