దేశంలో రోజు రోజుకూ కాలుష్యం పెరిగిపోతున్నది. నివారణకు ఇటు ప్రభుత్వాలు, అటు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు ఎంత అవగాహన కల్పిస్తున్నా, చర్యలు తీసుకుంటున్నా ఫలితం నామమాత్రంగానే ఉంటున్నది. ఫలితంగా మనిషి తన ఆయుష్షును తనకు తానే తగ్గించుకుంటున్నాడు. దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యంతో మానిషి ఆయుష్షు సగటున 3.5 ఏళ్లు తగ్గుతున్నదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగొచ్చని ఇటీవల చికాగో విశ్వవిద్యాలయం వాయు నాణ్యత జీవన సూచిక ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024’ నివేదిక సంచలన ప్రకటన చేసింది. పంటలు కాల్చడం, ఇటుక బట్టీలతో వచ్చే పొగ, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలకు దోహదపడ్డాయని ఆ నివేదిక స్పష్టం చేసింది.
మహమ్మద్ నిసార్
3.5 ఏండ్లు తగ్గుతున్న ఆయుష్షు
ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనాభాలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నది. ఫలితంగా వాయు కాలుష్యం పెరిగి దేశం అనారోగ్యంతో ఆర్థికభారాన్ని ఎదుర్కుంటున్నదని పలు నివేదికలు చెప్తున్నాయి. అయితే నిరంతరం పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్‌తో భారతీయులు సగటున మూడున్నరేండ్లకు పైగా ఆయుష్షును కోల్పోతున్నారని చికాగో విశ్వవిద్యాలయం వాయు నాణ్యత జీవన సూచిక ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024 ’ నివేదిక ఇటీవల స్పష్టం చేసింది. కాలుష్య స్థాయిలు 2021తో పోల్చితే 2022లో 19.3 శాతం తగ్గినప్పటికీ ప్రస్తుతం కాలుష్య ప్రభావం ప్రజలపై ఇంకా తీవ్ర ప్రతికూలంగా ఉందని పేర్కొన్నది. కాలుష్య స్థాయిలు ఇలాగే కొనసాగితే దేశంలోని సగటు మనిషి 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుష్షును కోల్పోయే అవకాశం ఉందని విశ్వవిద్యాలయం తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా దేశంలోని ఉత్తర మైదాన ప్రాంతాలు అత్యంత కలుషితమైనవిగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇక్కడ సుమారు 40 శాతం మంది ఎయిర్ పొల్యూషన్ ప్రభావాన్ని ఎదుర్కుంటున్నారని తెలిపింది. ఈ స్థాయిలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సగటున ఓ వ్యక్తి 5.4 సంవత్సరాల ఆయుష్షును కోల్పోయే అవకాశం లేక పోలేదని అంచనా వేసింది. ఒకవేళ వెంటనే అప్రమత్తమై కాలుష్య కారకాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే ఆయుష్షును 1.2 సంవత్సరాలు పెంచుకునేందుకు చాయిస్ ఉంటుందని నివేదిక వెల్లడించింది.
మూడు రాష్ట్రాల్లో అత్యధికం..
దేశంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు దేశంలోనే అత్యధిక కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాల్లో నివసిస్తున్న సుమారు 292.3 మిలియన్ల ప్రజలు ఇప్పుడు 2.9 సంవత్సరాల ఆయుష్షును కోల్పోతున్నారు. పంటలను కాల్చడం, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలకు దోహద పడుతున్నాయని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024 తెలిపింది. దేశంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో ఐదు ఉత్తర ప్రదేశ్‌లో ఉండగా నాలుగు నగరాలు హర్యానా, నాలుగు బిహార్‌లో, మరో మూడు నగరాలు ఒడిశాలో ఉన్నాయి.
2024లో భారతదేశంలో అత్యంత కలుషితమైన 20 నగరాలు
నగరం రాష్ట్రం తీవ్రత
1. బైర్నిహాట్ మేఘాలయ (151.5 µg/m3)
2. బెగుసరాయ్ బిహార్ (146.8 µg/m3)
3. అంగుల్ ఒడిశా (121.6 µg/m3)
4. ఢిల్లీ కేంద్ర పాలిక ప్రాంతం (100.5 µg/m3)
5. బాలాసోర్ ఒడిశా (92.9 µg/m3)
6. భువనేశ్వర్ ఒడిశా (91.8 µg/m3)
7. కతిహార్ బిహార్ (89.5 µg/m3)
8. పాట్నా బిహార్ (89 µg/m3)
9. ఫరీదాబాద్ హర్యానా (86.2 µg/m3)
10. ముజఫర్‌నగర్ ఉత్తర ప్రదేశ్ (84.8 µg/m3)
11. నోయిడా ఉత్తర ప్రదేశ్ (83 µg/m3)
12. భాగల్పూర్ బిహార్ (82 µg/m3)
13. మీరట్ ఉత్తర ప్రదేశ్ (80.7 µg/m3)
14. ధరుహేరా హర్యానా (79.4 µg/m3)
15. మనేసర్ హర్యానా (77.7 µg/m3)
16. ఘజియాబాద్ ఉత్తర ప్రదేశ్ (77.7 µg/m3)
17. బాగ్‌పత్ ఉత్తర ప్రదేశ్ (77.4 µg/m3)
18. భివాడి రాజస్థాన్ (77.1 µg/m3)
19. అగర్తల త్రిపుర (76.30 µg/m3)
20. బహదూర్‌ఘర్ హర్యానా (75.8 µg/m3)
హైదరాబాద్‌లోనూ అధికమే..
హైదరాబాద్‌లోనూ పొల్యూషన్ ప్రభావం తీవ్రంగానే ఉన్నది. పట్టణీకరణ పెరిగి పోవడం, ఎక్కువ సంఖ్యలో ఫ్యాక్టరీల ఏర్పాటు, వాహనాల సంఖ్య పెరుగుదల కాలుష్యానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. నగర శివారులోని పారిశ్రామిక వాడల్లో ఫార్మా, డ్రగ్, బల్క్‌డ్రగ్ వంటి పరిశ్రమలతో పాటు చిన్నా చితక కలిపి సుమారు 200 నుంచి 300 వరకూ కంపెనీలు ఉన్నాయని తెలుస్తున్నది. వీటి ద్వారా వచ్చే కాలుష్యం కొంత దూరం వరకూ ప్రభావితం చేస్తాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. వీటి నుంచి వచ్చే పొగ, ఇతర వ్యర్థాలు గాలిలో కలిసిపోవడంతో కాలుష్య కారకాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని తెలుస్తున్నది.
హైదరాబాద్‌లో జనవరి నుంచి ఆగస్టు వరకూ ఎయిర్ క్వాలిటీ వాల్యూస్ వివరాలు
1. పాశమైలారం 138
2. బొల్లారం 132
3. సనత్ నగర్ 130
4. జూపార్క్ ఏరియా 109
5. నాచారం 99
6. ఇక్రిసాట్ 94
7. చార్మినార్ 93
8. పారడైజ్ హెచ్ఎండబ్ల్యూఎస్, జీడిమెట్ల 92
9. ఉప్పల్ 88
10. చిక్కడపల్లి 85
వాయు కాలుష్య అత్యంత ప్రమాదకరం
గాలిలో వివిధ కాలుష్య కారకాలు ఉంటాయి. అత్యంత సాధారణంగా ట్రాక్ చేయబడిన కాలుష్య కారకాలలో PM2.5 అని పిలువబడే చాలా చిన్న, సూక్ష్మమైన కణాలు. ఈ చిన్న కాలుష్య కారకాలు 2.5 మైక్రోగ్రాముల వెడల్పులో ఉంటాయి. వీటికి ఊపిరితిత్తులు, రక్తప్రవాహంలోకి లోతుగా ప్రవేశించగలిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇవి మరింత ప్రమాదకరమైన కాలుష్య కారకాల్లో ఒకటిగా పరిగణించబడతాయి. భారతదేశంలోని అత్యంత కాలుష్య నగరాల ర్యాంకింగ్‌లు PM2.5 కాలుష్య స్థాయిల ఆధారంగానే ర్యాంక్ చేయబడ్డాయి.
మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
వాయు కాలుష్యం మానవ కణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో సంబంధం కలిగి ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా క్యాన్సర్‌కు పునాది వేసే అవకాశం ఉంటుంది. 2013లో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఆన్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) వాయు కాలుష్యాన్ని మానవ క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. కాలుష్యంతో ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం, ఉబ్బసం, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి.
మహిళలకు రొమ్ము క్యాన్సర్, పిల్లల్లో అస్తమా..
వాయు కాలుష్యం మహిళల్లో ఏ విధమైన సమస్యకు దారి తీస్తుందనే దానిపై ఓ సంస్థ 57,000 కంటే ఎక్కువ మంది మహిళలపై అధ్యయనం చేసింది. ప్రధాన రహదారులకు సమీపంలో నివసించే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్టు గుర్తించింది. బొగ్గు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, వృద్ధుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచిందని వెల్లడైంది. ఇక పిల్లలపై జరిగిన మరో సర్వేలో రద్దీగా ఉండే రోడ్ల దగ్గర నివసించే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అధిక స్థాయి వాయు కాలుష్యాలకు గురైన పిల్లల్లో యుక్తవయస్సులోనే బ్రోన్కైటిస్ లక్షణాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడైంది. అధిక కాలుష్య స్థాయిలు ఉన్న కమ్యూనిటీల్లో నివసించే పిల్లల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది.
ప్రతి ఒక్కరూ విరివిగా చెట్లు నాటాలి
వాయుకాలుష్యం వల్ల అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో విరివిరిగా మొక్కలు నాటాలి. రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాలతోనూ కాలుష్యం కలుషితం అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వాడకాన్నీ నివారించాల్సిన అవసరం ఉంది. రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం మానేసి.. మట్టితో తయారు చేసిన వినాయకులను వాడాలి. దీని వల్ల నీటి కాలుష్యం సైతం తగ్గే అవకాశం ఉంది. కాలుష్యం ఎక్కువగా వెదజల్లే ఫ్యాక్టరీలను ఊరి లేదా పట్టణ చివరన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. సమాజ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చినప్పుడే.. 100 శాతం కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుంది.
= పాల్వంచ హరికిషన్ (సామాజిక కార్యకర్త, యాదాద్రిభువనగిరి జిల్లా)