ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కొరడా ఝుళిపించనున్న హైడ్రా!

హైదరాబాద్ పరిసరాల్లో జల వనరుల సంరక్షణే లక్ష్యంగా హైడ్రా తన చర్యలను కొనసాగిస్తున్నది.

Update: 2024-10-03 01:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ పరిసరాల్లో జల వనరుల సంరక్షణే లక్ష్యంగా హైడ్రా తన చర్యలను కొనసాగిస్తున్నది. అయితే హైడ్రా ఏర్పాటు సమయంలో చట్టం, మార్గదర్శకాలేవీ ప్రత్యేకంగా రూపొందించకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో విపక్షాలు, కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ.. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే హైడ్రాకు ప్రత్యేక చట్టం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించగా.. ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ బాధ్యతను సీఎంవో తీసుకున్నది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ చట్టాలపై నైపుణ్యం కలిగిన నిష్ణాతులతో ఉన్నతాధికారులు చర్చించారు. త్వరలోనే డ్రాఫ్ట్ అందుబాటులోకి రానున్నదని విశ్వసనీయంగా తెలిసింది. అధ్యయనం కోసం ఇప్పటికే నిపుణులకు బాధ్యతలు అప్పగించినట్టు టాక్. కొత్తగా రానున్న చట్టం ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, జలవనరులను కాపాడేలా ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ హైడ్రా వంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకునే బాధ్యతను కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించడం గమనార్హం. తాజాగా జీహెచ్ఎంసీ చట్టంలో కొన్ని సవరణలు చేసి, అధికారాలను హైడ్రా కమిషనర్‌‌కు అప్పగించారు. దీన్ని ఆర్డినెన్స్‌గా తీసుకొస్తున్నారు. భూముల సంరక్షణ రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయత్ రాజ్, హెచ్ఎండీఏ శాఖలతోనూ ముడిపడి ఉండటంతో పూర్తి స్థాయిలో చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు నడుస్తున్నది.

హైడ్రాకు సంబంధం లేకపోయినా..

మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే నాలుగు నెలల నుంచి సర్వే చేపట్టింది. అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్/బఫర్ జోన్ ఆక్రమణలను గుర్తించి నోటీసులను జారీ చేసింది. డబుల్ బెడ్రూం ఇంటి సదుపాయం కల్పించిన తర్వాతే ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే పేదల ఇండ్లు ఎలా కూల్చేస్తారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కూల్చివేతలను అడ్డుకుంటానంటూ మూసీ రివర్ బోర్డు చైర్మన్ గా పని చేసిన ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి సైతం ప్రకటించారు. అయితే ఇదంతా హైడ్రాకు సంబంధమే లేదంటూ కమిషనర్ రంగనాథ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ప్రతి చర్యను గమనిస్తున్నట్లు..

‘సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తేనే, స్థానిక సంస్థలు అనుమతులు ఇస్తేనే సామాన్యులు ఇండ్లు నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్ చేయొచ్చు హైడ్రా ఏర్పాటు అభినందనీయమే.. కానీ పనితీరే అభ్యంతరకరం’ అని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని ప్రశ్నించింది. దీంతో కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బందిని కోరడంతో సమకూర్చామని హైడ్రా కమిషనర్ రంగానాథ్ బదులివ్వాల్సి వచ్చింది. ప్రస్తుతానికి హైడ్రాకు ప్రత్యేకాధికారాలు లేకపోవడంతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వారిని ముందు పెట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే కూల్చివేతలకు సంబంధించి నోటీసులు హైడ్రా ఇవ్వకపోయినా.. పూర్తి బాధ్యత హైడ్రాదే అన్నట్టు మీడియా, సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారు. హైడ్రాకు సంబంధించి ప్రతి చర్యనూ ప్రజలు గమనిస్తున్నారు.

నోటీసులతో తహశీల్దార్లకే ఎఫెక్ట్..

ప్రభుత్వ భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కబ్జాకు గురైన వాటిపై హైడ్రా యాక్షన్ తీసుకుంటున్నది. కానీ దానికి ముందు రెవెన్యూ అధికారులే నోటీసులు జారీ చేస్తున్నారు. తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్-1905 సెక్షన్ 3(1), 3(2) ప్రకారం ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి పట్ల చర్యలు తీసుకుంటున్నట్లు నోటీసులు ఇస్తున్నారు. అలాగే వాల్టా చట్టం-2002 సెక్షన్ 23 ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. ఇందులో రెండు వేర్వేరు నోటీసులను గమనించొచ్చు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడితే ల్యాండ్ ఎంక్రోచ్ మెంట్ యాక్ట్-1905, సెక్షన్ 6 ప్రకారం నోటీసులు జారీ చేయొచ్చు. అంటే ఒకరు లేదా ఇద్దరు నిర్మాణాలు చేపడితే ఈ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసి గడువు ఇస్తారు. అదే కొందరు సమూహం కలిసి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఇదే చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కూల్చివేతలు చేపట్టొచ్చు. ఇదంతా కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇప్పుడీ నోటీసుల జారీలో తలెత్తుతున్న లీగల్ ఇష్యూస్ ని రెవెన్యూ అధికారులే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఈ శాఖకు సపోర్టుగా మాత్రమే హైడ్రా వ్యవహరిస్తున్నది. హైడ్రాకు ప్రత్యేకాధికారాలేవీ లేకపోవడంతో ఇప్పుడీ సమస్య ఎదురవుతున్నది.

అధికారాల ఏకీకరణ..

ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమాలపై చర్యలు, కబ్జాల నియంత్రణకు పలు చట్టాలు ఉన్నాయి. రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్, జీహెచ్ఎంసీ, పంచాయత్ రాజ్, పోలీసు శాఖల ఆధీనంలో ఉన్నాయి. ఆయా శాఖల మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు అధికారాలు ఉన్నాయి. ఇందులోనే ప్రతి జిల్లాలోనూ హైడ్రా వంటి సంస్థ లేదా ప్రత్యేకాధికారులకు అధికారాలను కట్టబెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రెవెన్యూ యాక్ట్, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1, 6, 7 సెక్షన్లు, తెలంగాణ పురపాలక చట్టం 2019, హెచ్ఎండీఏ చట్టం 2008లోని అధికారాల్లో మార్పులు రానున్నాయి. ఇప్పుడున్న హైడ్రాకే దాని పరిధిలో నోటీసులు జారీ చేసి, యాక్షన్ తీసుకునే అధికారాలు వస్తాయి. అలాగే జిల్లాల్లోనూ అదే విధంగా కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం అవతరించగానే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేయడం సైతం కబ్జాలకు ఆస్కారమిచ్చింది. అందుకే ఇప్పుడు ప్రభుత్వ భూములను, చెరువులు, కుంటలను కాపాడేందుకు సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. ఆ చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేటట్లుగా రూపొందించనున్నారు. త్వరలోనే ఈ చట్టం కార్యరూపం దాల్చనున్నట్టు తెలిసింది.

ప్రజల డిమాండ్లు ఇవి..

-ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థల అధికారులు, రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవాలి.

-హైకోర్టు తీర్పు ప్రకారం వాటిలో ఉన్న పట్టా భూముల్లోని నిర్మాణాలకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ప్రత్యామ్నాయంగా ఇల్లు లేదా ఇంటి స్థలం ఇవ్వాలి.

-రీహాబిటేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాతే కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలి.


Similar News