వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించం : మంత్రి దామోదర్
ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు.
దిశ, వరంగల్ బ్యూరోః ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి అసంక్రమిత వ్యాధుల కేంద్రం, ఈసీజీ కేంద్రం, 13 కోట్లతో నిర్మించనున్న నాలుగు అంతస్తుల భవన నిర్మాణ భవనానికి శంకుస్థాపన, అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని హెచ్చరించారు. ఈ ప్రాంతం పరిశ్రమల ప్రాంతమని అంతేకాకుండా మంథని, పెద్దపల్లితో పాటు సమీప రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వైద్య సేవలకు వస్తుంటారని మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. మారుమూల ప్రాంతాలున్న ఈ జిల్లాలో వైద్య సేవల్లో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వైద్య సిబ్బంది అన్ని వేళల్లో అందుబాటులో అప్రమత్తంగా ఉంటూ నిరంతర వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లాకు 2 ప్రాథమిక, 2 కమ్యూనిటి ఆసుపత్రులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం చెప్పింది చేస్తుందని కట్టు కథలు చెప్పే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు ఉన్న ఏరియా అని ఈ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాథమిక వైద్య, ఆయుష్ కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా వైద్య సేవలు అందించాలని తెలిపారు. అసంక్రమిత వ్యాధుల సేవలపై క్రమం తప్పక రిపోర్టులు అందజేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లా, మండల కేంద్రంలో ఎన్సీపీ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 400 వందల సబ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 130 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మెరుగైన సేవలు అందించేందుకు 8 వేల మంది వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశామని, ఇటీవల 441 సర్జన్లను, ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టు లు భర్తీ చేసినట్లు స్పష్టం చేశారు. లోపాలు సరిచేసుకుని ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రులకు సౌకర్యాలు, డ్రగ్స్ ఎక్విప్మెంట్ కొరత రాకుండా ఇస్తామని తెలిపారు. ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని తెలిపారు. స్టోర్ ఎల్లప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ అందుబాటులో లేవన్న అంశం రావొద్దని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వైద్య సేవలపై ఫిర్యాదులు ఉన్నాయని సరిచేసుకోవాల్సిన బాధ్యత మీ పై ఉందని మంత్రి పేర్కొన్నారు. సేవలకు వచ్చే వారు పేషెంట్స్ కాదని మన కస్టమర్స్ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎమ్మారై సేవలు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింగరేణి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని డెడికేటెడ్ గా ఫ్యాషన్ గా వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఎలాంటి అవసరం ఉన్న ప్రభుత్వం తీరుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ పర్సనల్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… శాసన సభ్యులు కోరిన విధంగా ప్రాథమిక,కమ్యూనిటీ కేంద్రాలు,అంబులెన్స్ సేవలను మంజూరు చేస్తామని తెలిపారు. చిట్యాల ఆస్పత్రిలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా వైద్యాధికారి, ఆసుపత్రి పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.