దేశ చరిత్ర, సైన్స్‌పై RSS డైరెక్షన్‌లో బీజేపీ దాడి: టీఎస్‌యూటీఎఫ్
చరిత్ర, సైన్స్‌పై మత శక్తుల దాడిగా పేర్కొంటూ నూతన విద్యా విధానం పేరిట భారతీయ సమాజంపై కేంద్ర ప్రభుత్వం ధ్వంస రచన ప్రారంభమైందని తెలంగాణ
దిశ, తెలంగాణ బ్యూరో: చరిత్ర, సైన్స్‌పై మత శక్తుల దాడిగా పేర్కొంటూ నూతన విద్యా విధానం పేరిట భారతీయ సమాజంపై కేంద్ర ప్రభుత్వం ధ్వంస రచన ప్రారంభమైందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌సీఈఆర్టీ సిలబస్ నుంచి జీవ పరిణామ క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాలను తొలగించారని, ఇంకా చరిత్ర నుంచి మొఘలుల చరిత్ర, గాంధీ హత్య, గుజరాత్ అల్లర్లు తదితర పాఠ్యాంశాలను తొలగించారని తీవ్రంగా ఖండించారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలకు చెందిన 1800 మంది సైన్స్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శాస్త్ర వేత్తలు ఎన్సీఈఆర్టీ చర్యలను తప్పుపడుతూ సంస్థ డైరెక్టర్‌కు లేఖలు వ్రాశారని తెలిపారు. అభ్యుదయ, ప్రజాస్వామిక వాదులు, సైన్స్ ప్రేమికులు అందరూ ఈ చర్యలను తీవ్రంగా ప్రతిఘటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీఈఆర్టీ తక్షణమే తమ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సైన్స్, చరిత్ర లేకపోతే ఈ దేశానికి భవిష్యత్ లేదు: ఎస్ఎఫ్ఐ
సీబీఎస్ఈ పదవ తరగతి పాఠాలు నుంచి డార్విన్ సిద్ధాంతం తొలగించడం అంటే విద్యలో మూఢనమ్మకాలు పెంచడం అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యారంగంపై ఆర్ఎస్ఎస్ డైరెక్షన్‌లో బీజేపీ దాడి చేస్తుందన్నారు. 12 వ తరగతి పాఠాలు తొలగించిన ఎన్సీఈఆర్టీ ఈ దేశంలో సైన్స్ విద్యకు, దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశంలో విద్యను మూఢత్వంలోకి నెట్టి విద్యలో కాషాయికరణ పెంచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జాతీయోద్యమ వీరులు, హిందూ, ముస్లిం ఐక్యతను, గాంధీ హత్య లాంటి సబ్జెక్టులు తొలగించడం, డార్విన్ సిద్ధాంతం తొలగించడం లాంటి చర్యల వల్ల ఈ దేశ విద్యార్థులు సైన్స్ పాఠ్యాంశాలును మళ్ళీ పాత పద్దతిలో విశ్వాసాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. " సైన్స్, చరిత్ర లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదు" తొలగిస్తున్న పాఠాలను మళ్ళీ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.