కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు : సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ (Chakali Ailamma) పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ (Hyderabad) లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం.. కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర చరిత్ర పుటల్లో నిలిచి పోతుందని కొనియాడారు. భూముల ఆక్రమణలను నిజాం కాలంలోనే ఐలమ్మ అడ్డుకున్నారని.. దీనిని స్పూర్తిగా తీసుకొని ఇప్పుడు హైడ్రా (Hydra)ను ఏర్పాటు చేశామని.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలను అడ్డుకుంటున్నామని తెలిపారు. అలాగే చెరువులకు నిలయమైన హైదరాబాద్ నగరంలోని చెరువులను కుంటలను కాపాడుతున్నామని సీఎం అన్నారు. చాకలి ఐలమ్మ పేరును కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి పెడుతున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.