భట్టి పాదయాత్రలో కోమటిరెడ్డి పాల్గొనేనా..?
పార్టీకి ప్రాణం ఎన్నికలు.. పార్టీకి అధికారం తీసుకువచ్చేందుకు మండుటెండలో కష్టపడుతున్న నాయకులకు మానసిక ధైర్యాన్ని కల్పించడం సుశిక్తులైన కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత.
దిశ, నల్గొండ బ్యూరో : పార్టీకి ప్రాణం ఎన్నికలు.. పార్టీకి అధికారం తీసుకువచ్చేందుకు మండుటెండలో కష్టపడుతున్న నాయకులకు మానసిక ధైర్యాన్ని కల్పించడం సుశిక్తులైన కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత. కానీ బోనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత నియోజకవర్గమైన నల్లగొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర చేస్తూ నాయకుడు వస్తే కనీసం పలకరించకపోవడం అత్యంత దుర్మార్గం.
జిల్లాలో భట్టి పాదయాత్ర..
తెలంగాణ శాసనసభ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సుమారు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మంత్రులు ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునిస్తున్నారు. మండే ఎండలో పల్లె పల్లె తిరుగుతూ ప్రజలందరినీ పలకరిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే వారం రోజుల క్రితం దేవరకొండ నియోజకవర్గంలో ప్రవేశిస్తూ నల్లగొండ జిల్లాలో అడుగు పెట్టాడు. ఆ నియోజకవర్గం పూర్తి చేసుకొని ఆ తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పాదయాత్ర నిర్వహించి రెండు రోజుల క్రితమే నల్లగొండ నియోజకవర్గంలో అడుగు పెట్టారు.
పాదయాత్రకు స్వాగతం పలకని కోమటిరెడ్డి..
భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు తెలంగాణ జిల్లాలోని ఏ నియోజకవర్గం వెళ్లిన ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఇతర నాయకులు స్వాగతం పలుకుతున్న విషయం అందరికి తెలిసిందే. కానీ రెండు రోజుల క్రితం నల్లగొండ నియోజకవర్గంలో అడుగుపెట్టిన భట్టి విక్రమార్కకు మాజీమంత్రి ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం స్వాగతం పలికిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే 15న భట్టి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు పాదయాత్రకు విరామం ఇచ్చి కనగల్ మండలం జి చెన్నారంలో విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నరసింహ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విశ్రాంతి శిబిరం వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
కానీ ఎంపీ హైదరాబాదులో ఉండి కూడా విశ్రాంతి శిభిరం వద్దకు రాలేదు. పక్క జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే " దళితున్ని సీఎం చేయాలని సభా వేదిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు కేవలం భట్టి విక్రమార్క" ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలేనని రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అర్థమైంది. అంటే సీఎం పదవికి అర్హత కలిగిన బట్టి విక్రమార్క పాదయాత్రతో నల్గొండ నియోజకవర్గంలో అడుగుపెడితే స్వాగతం పలకకపోవడం లెక్కలేని తనం లేదా వివక్ష చూపడమేనని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన బలహీన వర్గాల నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
భట్టి యాత్రకు కూడా దూరమే..
బట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా నల్లగొండ నియోజకవర్గ కేంద్రంలో ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీని తీసుకువచ్చి లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తాం" అంటూ కోమటిరెడ్డి పత్రికా విలేకరుల సాక్షిగా ప్రకటించాడు. అలాంటి నాయకుడు నేడు పాదయాత్రలో కూడా కలిసి నడిచేందుకు సిద్ధంగా లేడు అనిపిస్తుంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో భర్తీ చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఎక్కడ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్న దాఖలాలు లేవు. పక్క నియోజకవర్గానికి వెళ్లి హల్చల్ చేసిన కోమటిరెడ్డి తన సొంత నియోజకవర్గంలో మాత్రం గైర్హాజరు అవుతున్నట్టు తెలుస్తుంది. గాంధీ సభ దేవుడెరుగు కనీసం కార్యకర్తలు అందరిని సమీకరించిన సభ జరుగుతుందో లేదో చూడాల్సింది మరి. ఉమ్మడి జిల్లా కేంద్రం భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం నల్లగొండలో సభ పెట్టకపోవడం దళితులు అణగారిన వర్గాల పట్ల ఒక వర్గం కావాలని అణిచివేతకు తరలిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.