పురపాలికలో పనులు పూర్తి అయ్యేదెప్పుడు?

మున్సిపాలిటీలో రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల గత మూడు నెలలుగా నిలిచిపోవటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-03-10 09:31 GMT

దిశ, చండూరు: మున్సిపాలిటీలో రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల గత మూడు నెలలుగా నిలిచిపోవటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభివృద్ధి పనులు ప్రారంభించి నప్పటికి ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పనులను నాణ్యతగా చేపట్టలేదని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా రోడ్డు విస్తరణలో ఇరువైపులా 45 ఫీట్ల వెడల్పుతో విస్తరిస్తున్నామని కాంట్రాక్టర్ చెబుతున్నప్పటికీ ఒక్కోచోట ఒక్కో రకంగా డ్రైనేజీ నిర్మించినట్లు కొందరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

ఈ సమీక్ష సమావేశానికి అసలు కాంట్రాక్టర్ రాకపోవటం, పనులపై అభ్యంతరాలు రావటంతో ఎమ్మెల్యే సహితం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ లో రోడ్డు మధ్య నుండి ఇరువైపులా యాభై ఫీట్ల చొప్పున వంద ఫీట్లకు రోడ్డును విస్తరించాలి. కానీ ప్రస్తుతం తొంభై ఫీట్ల మేరకే పరిమితం చేశారు. ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డును వంద ఫీట్లకు విస్తరించేందుకు ప్రణాళికను రూపొందిస్తే ఎవరి ప్రయోజనం కోసం వెడల్పు తగ్గించారనే ఆసక్తి కరమైన చర్చ ప్రజలలో జరుగుతుంది. పనుల నిలుపుదలకు నిబంధనల ఉల్లంఘన లతోపాటు, పనులు నాసిరకంగా చేపట్టడం కూడా ఓ కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఆగిపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలు వల్ల వచ్చే దుమ్ము, ధూళితో వ్యాపారస్తులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు.

కొందరైతే దుమ్ముతో శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా డ్రైనేజీలో నీరు నిలవడం వల్ల దోమలకు ఆవాసంగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో ఎక్కడ రోగాల బారిన పడుతామో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల ఇండ్ల ముందు డ్రైనేజీ నిర్మించి అసంపూర్తిగా వదిలేయడంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని భయంతో జీవనం గడుపుతున్నారు. ఏదేమైనప్పటికి అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, నాణ్యతలో రాజీపడకుండా త్వరితగతిన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పనుల కొనసాగింపు విషయం పై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరగా ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాగానే కాంట్రాక్టర్ పనులు చేస్తామని చెబుతున్నాడని ,త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.


Similar News