ఆయన్ని సస్పెండ్ చేయడంలో సమస్య ఏమిటో...
దేశవ్యాప్తంగా రూ.10 లక్షల మంది సభ్యులతో రూ.1,500 కోట్ల మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్న (ఇండస్‌వివా హెల్త్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్)తో సంబంధం ఉన్న ఓ ఉపాధ్యాయుడిని 2021లో అరెస్టు చేశారు.
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : దేశవ్యాప్తంగా రూ.10 లక్షల మంది సభ్యులతో రూ.1,500 కోట్ల మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్న (ఇండస్‌వివా హెల్త్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్)తో సంబంధం ఉన్న ఓ ఉపాధ్యాయుడిని 2021లో అరెస్టు చేశారు. ఈ విషయంలో వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.20 కోట్లకు పైగా నగదు స్తంభింపజేశారు. ఈ అక్రమ వ్యాపారం వారి భార్యల పేరు మీద కూడా నిర్వహించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
కానీ ఆ ఉపాధ్యాయుడు ఇప్పటి వరకు సస్పెండ్ కాలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి అక్రమంగా లాంగ్ లీవ్‌లను పొంది విద్యార్థులకు పాఠాలు బోధించకుండా అక్రమ సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం. 2021లో జైలు లో ఉన్న ఆ ఉపాధ్యాయుడిని జిల్లా విద్యా శాఖ అధికారి నేటికీ సస్పెండ్ చేయకపోవడం విశేషం.
ముడుపుల లెక్కలు చక్కబెడుతున్న లెక్కల మాస్టార్
అర్హత లేకున్నా ఈ ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి ముడుపుల లెక్కలు చూడడానికి నియమించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. సక్రమంగా విధులు నిర్వహించని ఉపాధ్యాయుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు వసూలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారికి అప్పగించడానికి ప్రత్యేకంగా ఈ లెక్కల మాస్టార్ ను ఏర్పాటు చేసుకున్నాడని విద్యా శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యా శాఖ అధికారి
విద్యా శాఖలో కొందరు ఉద్యోగులపైన ఫిర్యాదులు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నాడని ఆ విద్యా శాఖ అధికారిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నాడని సూర్యాపేట జిల్లా విద్యా శాఖ అధికారిపై అభియోగాలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిసి కూడా జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
సస్పెండ్ చేయకపోవడానికి గల కారణం ఏమిటో...
దేశవ్యాప్తంగా 10 లక్షల మంది సభ్యులతో రూ. 1,500 కోట్ల మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్న (ఇండస్‌వివా హెల్త్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్) అక్రమ వ్యాపారంలో అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు నేటికీ సస్పెండ్ కాకుండా జిల్లా అధికారికి పెద్ద మొత్తంలో ముడుపులు అప్పజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం పై ఓ విద్యార్థి సంఘం నాయకుడు డీఈఓకు ఫిర్యాదు చేయగా ఆయన ఆ విద్యార్థి సంఘం నాయకుడితో దురుసుగా ప్రవర్తించినట్లు వినికిడి. ఇచ్చిన దరఖాస్తును తిరిగి ఆ విద్యార్థి సంఘం నాయకుడికి ఇచ్చినట్లు సమాచారం. ఇండస్‌వివా హెల్త్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పని చేసి అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడి పై జిల్లా కలెక్టర్ స్పెషల్ కమిటీ వేసి విచారణ జరిపించి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
నా దృష్టికి రాలేదు : డీఈఓ అశోక్
ఈ విషయం నా దృష్టికి రాలేదు. విషయం తెలుసుకొని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటా.