అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం...
అర్హులందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు
దిశ, నార్కట్ పల్లి : అర్హులందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే పది రోజుల్లో బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించుకుందాం అన్నారు. అదేవిధంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. నార్కట్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను శుక్రవారం అందజేసి ఈ విధంగా మాట్లాడారు. సీఎం సహాయనిది పేదలకు వరం లాంటిది అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తానని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి గొప్ప హృదయంతో ఆరోగ్యశ్రీని 10 లక్షల కు పెంచి ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా నిలిచారన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రాజెక్టును నీటితో నింపామని, భూగర్భ జలాలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. గత పాలకులు ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు. కుడి,ఎడమ కాలువలను పూర్తి చేసి ప్రతి చెరువులోకి నీటిని విడుదల చేస్తామన్నారు. మొదటగా నార్కట్ పల్లి చెరువులోకి నీటిని విడుదల చేయడం వల్ల ఏడవల్లి,లింగోటం, కట్టంగూరు మండలాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అదేవిధంగా పిల్లాయిపల్లి,ధర్మారెడ్డి కాలువల ద్వారా ఇప్పటికే కొన్ని చెరువులను నింపిన విషయాన్ని గుర్తు చేశారు. రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాను ముందుంటానన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చిన తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్ . వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఉమేష్, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్, జిల్లా నాయకులు బండ సాగర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు పాశం శ్రీనివాస్ రెడ్డి, వడ్డే భూపాల్ రెడ్డి, ఇల్లందుల కిట్టు, జేరిపోతుల భరత్, సిద్ధ గొని స్వామి, బింగి కొండయ్య, గడుసు శశిధర్ రెడ్డి, రేగట్టే నవీన్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.