నాగార్జునసాగర్‌లో జలకళ..ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
దిశ, నాగార్జున సాగర్ : నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సీజన్‌లో తొలిసారిగా ఆగస్టు 5న క్రస్ట్ గేట్లతో నీటి విడుదల ప్రారంభించగా..ప్రాజెక్టు వరద పోటెత్తడంతో సెప్టెంబర్ 19 వరకు కొనసాగింది. రెండు విడతల్లో 435 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతంం నీటి నిల్వ 590 అడుగులు ఉంది. సాగర్ జలాశయానికి వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్లతో నీటి విడుదల చేపడతామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది.
శ్రీశైలం జలాశయం ఒక గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 93,439 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. సాగర్ డ్యాం ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి 48,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 6257, ఎడమ కాలువకు 6022, ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 29,760, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 2400, లోలెవల్ కెనాల్‌కు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.ఈ సీజన్ తొలినాళ్లలో ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చింది. దీంతో శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. స్పిల్‌వే తో 1.68 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు.