అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం

కష్టపడి పండించిన పంట కండ్ల ముందే తడిసి ముద్దయితుంది.

Update: 2025-04-14 07:22 GMT
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
  • whatsapp icon

దిశ, అనంతగిరి : కష్టపడి పండించిన పంట కండ్ల ముందే తడిసి ముద్దయితుంది. పొత్తిళ్లలో ఉన్న బిడ్డ లాగా కంటికి రెప్పలా కాపాడిన పంట కేవలం ఒక్కరోజు కురిసిన వర్షానికి అతలాకుతలమైంది. అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు చేసిన నిర్లక్ష్యం వల్లే పంట పూర్తిస్థాయిలో వర్షానికి తడిసిందంటూ రైతులు ఆవేదనతో ఆరోపణలు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. వారం రోజుల్లో కోతకు వచ్చిన వరిపొలాలు వర్షానికి నేలవాలాయి. చేతికి అంది వచ్చిన ధాన్యం తడవడం, కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరి మండలంలో అమీనాబాద్, ఖానాపురం, అనంతగిరి మండల కేంద్రం గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసినట్లు రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారని అమీనాబాద్ వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో వర్షంతో పాటు భారీ సైజులో ఉన్న రాళ్ల వాన పడింది. పలు ప్రాంతాల్లో బత్తాయి, నిమ్మ, మామడి, కాయాలు నేలరాలడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి.. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల భూపాల్ రెడ్డి

రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం అనంతగిరి మండలం పరిధిలోని చనుపల్లి గ్రామంలో అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కల్లాలను పంట పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వడగండ్ల వాన రావడంతో వరి ధాన్యం తడిసి రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఆరుగాలం అప్పులు చేసి పండించిన పంట అకాల వర్షానికి ధాన్యం తడిసి అన్నదాతలు హరిగోశపడుతూ ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరైన సమయంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులకు నష్టపరిహారం తడిసిన ధాన్యాన్ని తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలన్నారు.

Similar News