అనుకునేది ఒకటి,అయ్యేది ఒకటి..మిర్యాలగూడలో స్పష్టత లేని కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక
మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాధారణ ఎన్నికల సమయంలో అనుకునేది ఒకటైతే జరిగేది మాత్రం ఇంకొకటి అవుతుంది. ఇలా ప్రతిసారి పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో
దిశ నల్లగొండ బ్యూరో : మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాధారణ ఎన్నికల సమయంలో అనుకునేది ఒకటైతే జరిగేది మాత్రం ఇంకొకటి అవుతుంది. ఇలా ప్రతిసారి పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో కార్యకర్తలకు అధిష్టానం షాక్ ఇస్తూనే ఉంది. గతంలో జరిగిన ఐదు సాధారణ ఎన్నికలలో కూడా కార్యకర్తలు ఊహించిన వ్యక్తికి కాకుండా మరొకరికి టికెట్ ఇస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో అధిష్టానం కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా అభ్యర్థిని ఎంపిక చేయడంలో విఫలమవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో తప్పుల వలన గతంలో జరిగిన ఐదు ఎన్నికలలో మూడుసార్లు ఓటమిని చూడాల్సి వచ్చిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వడం వలన పార్టీ ఓటమి పాలవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికలో అస్పష్టత
గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టత లేకుండా పోయింది. 1994 లో జరిగిన ఎన్నికలలో తిప్పన విజయసింహారెడ్డి ఓటమి చెందడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కార్యకర్తలకు షాకిస్తుంది. 1999లో జరిగిన ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డిని కాదని కొత్తగా రేపాల శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. అప్పటికి పార్టీ బలంగా ఉండడంతో రేపాల శ్రీనివాస్ గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా సిట్టింగ్ స్థానాన్ని వదులుకొని సీపీఎం అభ్యర్థి రంగారెడ్డికి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత కాలంలో 2009లో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు విజయసింహారెడ్డి, రేపాల శ్రీనివాస్ కు కాకుండా అనూహ్యంగా తిరునగర్ గంగాధర్ కు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. అనంతరం 2014 ముందు వేములపల్లి జెడ్పీటీసీ గా పోటీ చేసి ఓటమి పాలైన తూడి దేవేందర్ రెడ్డి మిర్యాలగూడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అనూహ్యంగా దేవేంద్ర రెడ్డిని పక్కకు పెట్టి జానారెడ్డి ముఖ్య అనుచరునిగా పేరుండి ప్రస్తుతం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో అప్పటి టీఆర్ ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి పై 6000 పైచిలుకు ఓట్లతో భాస్కర రావు విజయం సాధించారు. తర్వాత రాజకీయ పరిణామాలలో భాగంగా భాస్కర రావు టీఆర్ఎస్ పార్టీలో చేరగా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అమరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో 2018 ముందస్తు ఎన్నికల సైతం అమరేందర్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందనుకున్న సమయంలో పార్టీ కార్యకర్తలకు షాకిస్తూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు టికెట్ ఇచ్చి మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలకు అధిష్టానం షాక్ ఇచ్చింది. దీంతో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతోపాటు ప్రతిసారి అభ్యర్థిని చివరి క్షణాల్లో ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది.
బీఎల్ ఆర్ కు టికెట్ దక్కేనా..?
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఆర్ (బత్తుల లక్ష్మారెడ్డి) కు టికెట్ లభించడం కష్టమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కార్యకర్తలకు షాక్ ఇస్తూ వస్తుండడంతో ఈసారి కూడా సరైన నాయకున్ని ఎంపిక చేయడంలో స్పష్టత లేనట్లు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఆర్ తో పాటు మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి , డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ పార్టీ టికెట్టు ఆశిస్తున్నట్లు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తుంది. వీరితోపాటు హైదరాబాద్ కు చెందిన మరొక వ్యక్తి కూడా టికెట్ ఆశిస్తున్నట్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం సాగుతుంది. గత ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ను అంచనా వేస్తే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత అభ్యర్థిని కేటాయించే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతాన్ని బట్టి చూస్తే బీఎల్ఆర్ కు టికెట్ దక్కేది... దక్కనిది వేచి చూడాల్సిందే.