మళ్లీ సొంత గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీకి మరో బిగ్ షాక్ తప్పదా..?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల యుద్ధం కోసం ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీలో ఒక

Update: 2023-09-24 03:19 GMT

దిశ, చౌటుప్పల్ టౌన్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల యుద్ధం కోసం ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీలో ఒక కీలక నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు..? పార్టీ పెద్దల పై అలిగారా?. లేక.. కమలం పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు ఏమైనా మంతనాలు జరుపుతున్నారా..? అసలు రాజగోపాల్ రెడ్డి మౌనం వెనక మర్మమేంటి? అనే అంశంపై మునుగోడు నియోజకవర్గ ప్రజల్లో తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి.

మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. కమలం పార్టీ తరపున మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సాధారణ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు కదనరంగంలోకి దూకేందుకు సిద్ధపడుతున్నా బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్న రాజగోపాల్ రెడ్డి మాత్రం గత కొన్ని నెలలుగా మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు.

ఆయన మౌనం వెనుక మర్మం ఏమిటనే అంశంపై కమలం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన జి. కిషన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చివరిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా అడుగుపెట్టడం లేదు. బీజేపీ పార్టీపై రాజగోపాల్ రెడ్డి అలిగినట్లు తెలుసుకున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల ఫామ్ హౌస్‌కి వెళ్లి రాజగోపాల్ రెడ్డిని కలుసుకొని సముదాయించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయన మళ్లీ పార్టీ మారుతున్నారని.. కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారని ఆయన అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి.

సొంత గూటిలోకి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు ఇటీవల ఆయన రహస్యంగా తన ముఖ్య అనుచరులతో సమావేశమైనట్టు విశ్వసనీయ సమాచారం ఉంది. కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయని.. ఈ సారి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అనుచరులు సైతం గట్టిగా నమ్ముతుండడంతో రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి హ్యాండ్ ఇచ్చి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చిన రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలైనప్పటికీ ప్రజల్లో తన ఇమేజ్‌తో ఓటు బ్యాంకుని పెంచుకోగలిగారు.

వచ్చే ఎన్నికల్లో మునుగోడులో పాగా వేయడం ఖాయమని బీజేపీ నేతలు భావిస్తున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి యాక్టివ్‌గా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో వుండబోతున్నారని ఆ పార్టీ అధిష్ఠానం పేర్కొంటున్నా ఆయన ఆ పార్టీలో చురుకుగా లేకపోవడంతో వచ్చే ఎన్నికల లోపు ఏ పార్టీలో ఉంటారో.. ఎక్కడినుంచి పోటీ చేస్తారో కూడా ఎవరికీ అర్ధం కాని పరిస్తితులు నెలకొన్నాయి. ఆయన అందరూ ఊహించినట్టుగానే మునుగోడు నుంచి పోటీ చేస్తే ఆయన వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Read More: మాణిక్యం ప్రకటనపై మంత్రి హరీష్ రావు సీరియస్.. బర్త్ డే పేరుతో హంగామా చేయబోతే అసలుకే ఎసరు..! 

Tags:    

Similar News