విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ సంద్యరాణిపై ఫైర్ అయ్యారు.
దిశ, మునుగోడు : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ సంద్యరాణిపై ఫైర్ అయ్యారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్ధుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. మాడిన అన్నం, నీళ్ల పప్పు చారు, పుల్లటి పెరుగు విద్యార్ధులకు అందిస్తుండడంతో..మీరైతే ఇలాంటివి తింటారా అని ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. పాఠశాలలోని విద్యార్ధులను కన్న బిడ్డలా చూసుకోవాలన్నారు. విద్యార్ధులకు చదువు కంటే ముందు మంచి భోజనం, వసతి, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించినప్పుడే విద్యార్ధులు ఆరోగ్యంగా ఉంటారని, అప్పుడే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు నేర్చుకుంటారన్నారు. హాస్టల్ లో ఎమ్మెల్యే స్వయంగా అన్నం, కూరలు వడ్డించి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థినులను ఆయన అడిగి తెలుసుకున్నారు. వారంలోగా మరో మారు ఈ హాస్టల్ కి వస్తానని భోజనం నాణ్యతతో లేకపోతే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఏజెన్సీ నిర్వాహకులు కూడా తమ పద్దతిని మార్చుకోవాలన్నారు. పాఠశాలలో మౌళిక వసతులు కల్పించేందుకు తన సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పలు శుభకార్యాలయాలకు ఆయన హజరైయ్యారు. ఆయన వెంట ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ ఆర్డివో శ్రీదేవి, తహశీల్ధార్ నరేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ సంద్యరాణి, నాయకులు, తదితరులు పాల్గోన్నారు.