తప్పిపోయిన బాలుడు…తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

తప్పిపోయిన బాలుడిని గంటల వ్యవధిలో పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కంట్రోల్ రూం ఇన్ స్పెక్టర్ మల్లేశం గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...

Update: 2024-09-21 13:05 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తప్పిపోయిన బాలుడిని గంటల వ్యవధిలో పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కంట్రోల్ రూం ఇన్ స్పెక్టర్ మల్లేశం గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... దంపతులు ఉమా పీటర్ నాలుగు సంవత్సరాల కొడుకు బెన్హర్ తో కలిసి ఆర్టీసీ బస్సులో వేములవాడ నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరారు. మార్గ మధ్యంలో సిద్దిపేట మోడల్ బస్టాండ్ వద్ద బస్సు ఆగగానే బెన్హర్ మరో మహిళతో కలిసి బస్సు దిగాడు. పిల్లవాడు బస్సు దిగిన విషయం గమనించకుండా తల్లిదండ్రులు బస్సులో వెళ్లిపోయారు. మహిళ దగ్గర ఉన్న బాలుడు ఏడవడంతో ప్రక్కనే ఉన్న ఆటో డ్రైవర్ డయల్ 100కు కాల్ చేసి తప్పిపోయిన బాలుడు విషయం తెలిపాడు.

పోలీసులు వెంటనే మహిళ వద్ద ఉన్న బస్సు టికెట్ వాట్సప్ చేయించుకొని టికెట్ పై ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా వేములవాడ డిపో మేనేజర్ బస్సు నెంబర్ తో పాటుగా కండక్టర్ ఫోన్ నెంబర్ తెలిపాడు. బాబు సిద్దిపేట బస్టాండ్ లో దిగిపోయిన విషయం తల్లిదండ్రులకు తెలపగా వేరే బస్సులో బాబు తల్లిదండ్రులు సిద్దిపేటకు రాగా పోలీసులు బెన్హర్ ను తల్లిదండ్రులకు అప్పగించారు. అబ్బాయి తల్లిదండ్రులు ఉమా, పీటర్ మా తప్పిదం వల్లే బాబు బస్సు దిగిపోయాడని, బాబులు క్షేమంగా అప్పగించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీస్ సిబ్బందిని సీపీ అనురాధ అభినందించారు.


Similar News