సూర్యాపేటని అవినీతికి అడ్డాగా మార్చిన మంత్రి

మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటని అవినీతికి నిలయంగా మార్చుకున్నాడని సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి జానయ్య యాదవ్ ఆరోపించారు.

Update: 2023-10-28 15:22 GMT

దిశ, సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటని అవినీతికి నిలయంగా మార్చుకున్నాడని సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి జానయ్య యాదవ్ ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ఆశించి ఉద్యమం చేస్తే చివరకు అగ్రకుల నాయకులు మాత్రమే తమ సొంత అభివృద్ధిని ఏర్పాటు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి 10 సంవత్సరాల నుంచి రాజ్యమేలుతున్నాడని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో ప్రజలను మోసం చేశారని మండి పడ్డారు. తెలంగాణ కోసం ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల నాయకులకు అందిస్తున్నారని ఇలాంటి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గెలిపించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి తానొక్కడే ఎదిగాడు తప్ప ఇతరులెవరికి సహాయ పడలేదని విమర్శలు చేశారు. దీనిని అరికట్టడానికే తానూ ఎమ్మెల్యే రేసులో ఉన్నానని, బహుజనుడైనా నన్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వాదించి గెలిపించాలని వేడుకున్నారు. అనంతరం వివిధ మండలాలకు చెందిన సుమారు 400 మంది బీఎస్పీలో చేరారు. ఈ సమావేశంలో స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ ధరావత్ నీలాబాయి లింగానాయక్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చాంద్ పాషా, బీఎస్పీ జిల్లా నాయకులు ఆవుల అంజయ్య, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు భీమపంగు రాజు, తదితరులున్నారు.

బీఎస్పీలో న్యాయవాదులు మూకుమ్మడి చేరికలు...



బహుజన వాదాన్ని గెలిపంచుకోవడం కోసం తాము సిద్ధంగా ఉన్నట్లు సూర్యాపేట జిల్లా న్యాయవాదులు చెప్పారు. శనివారం వారు మూకుమ్మడిగా జానయ్య సమక్షంలో బీఎస్పీలో చేరారు. వారిలో సీనియర్ న్యాయవాదులు తంతనపల్లి బిక్షమయ్య గౌడ్, బాణాల విజయ్, మాండ్ర మల్లయ్య యాదవ్,సుంకర బోయిన రాజు యాదవ్, మంతపురం కిషోర్ కుమార్, అలిశెట్టి రేణుక యాదవ్, బొజ్జ అనిల్ కుమార్,ఉప్పల మహేష్ యాదవ్,వేల్పుల అనిల్ కుమార్ యాదవ్, జవ్వాజి సతీష్ కుమార్ యాదవ్, బానోత్ అమర్ నాయక్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News