ఎండల ఎఫెక్ట్.. ఉపాధి కూలీలకు తప్పని తిప్పలు

Update: 2023-06-08 01:58 GMT

దిశ, వేములపల్లి : నిలువు నీడ లేక ఉపాధి హామీ కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. సరైన వసతులు లేక మంచినీళ్లు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత నెల రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన నీడ లేకపోవడంతో పాటు మంచినీటి వసతి లేక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం వలన ఎండలకు కూలీలకు తిప్పలు తప్పడం లేదు. గతంలో ఉపాధి హామీ కూలీలను పూర్తిస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ల పర్యవేక్షణలో ఉండేది. కానీ ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పజెప్పడంతో పర్యవేక్షణ లోపంతో పాటు వసతులు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైతున్నట్లు కూలీలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 31 మండలాల్లో మొత్తం 354171 జాబ్ కార్డులు ఉండగా 763979 కూలీలు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది 428535 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు.

పెరుగుతున్న ఎండలు

గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ఎండలు భారీగా పెరిగాయి. నెల రోజులుగా 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు వేడి పెరగడం వలన ఉపాధి హామీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో చిన్నపిల్లలు, వృద్ధులు సేద తీరడానికి టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి వసతి కల్పించేవారు. ప్రస్తుతం నీడ లేకపోవడంతో పాటు మంచినీళ్లు లేక కిలోమీటర్ల దూరం వెళ్లి పని చేస్తున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృద్ధులు, వికలాంగులు సరైన సౌకర్యాలు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

కనిపించని ఫస్ట్ ఎయిడ్ కిట్లు

ఉపాధి హామీ పని వ్యవసాయ భూముల్లో చేయాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స కోసం కిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేకపోవడం వలన ఏదైనా ప్రమాదం జరిగితే కిలోమీటర్ల కొద్దీ గ్రామానికి చేరుకొని చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రాథమిక చికిత్స అవసరమైన ఇట్లు లేకపోవడంతో ఆరోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూలీలు వాపోతున్నారు.

అలవెన్స్ కట్

ప్రతి వేసవికాలం మే నెలలో 30% అలవెన్స్ తో కలిపి కూలి చెల్లింపు చేసేవారు. ఏడాది ఎలాంటి అలవెన్స్ లేకుండా కూలీ డబ్బులు చెల్లించారు. ఉపాధి హామీ పనికి వెళ్లే వారికి గడ్డపార కు అలవెన్స్ అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ఆలయన్స్ను నిలిపివేశారు. దీంతో ఉపాధి హామీ కూలీలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంచినీటి వసతి కల్పించాలి

దొంగరి శ్రీనివాస్, వేములపల్లి.

ఉపాధి హామీ పని జరిగే చోట మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలి. ఎండలు తీవ్రంగా ఉండటం వలన తీసుకపోయిన నీళ్లు కొద్దిసేపటికి అయిపోతున్నాయి. దీంతో పనిచేసే దగ్గర మంచినీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.

నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలి - జూలిపాల లక్ష్మమ్మ

ఉపాధి హామీ పనుల వద్ద నీడ లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి నీడ ఏర్పాటు చేయాలి.

Tags:    

Similar News